
కంటిచూపుతో భయపెట్టారు. వెటకారంతో వెక్కిరించేవారు. తెలంగాణ యాసలో డైలాగులు చెప్తూ నవ్వించారు. రోజుకు 20 గంటలు పనిచేసేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ దునియాల కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) వంటి నటుడే లేడు అని నిరూపించుకున్నారు. ఊహించినదానికంటే వెయ్యి రెట్ల అభిమానం, వందలాది సినిమాలు చేసి సంపాదించిన కోట్లాది ఆస్తి.. అయినా కోట మనసు సంతోషించలేదు. పైగా గుండెలోని దుఃఖం తనను వెంటాడుతూనే ఉండేది. కారణం కొడుకును కోల్పోవడం!
ఎలా మర్చిపోతాను?
2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోటా కుమారుడు ఆంజనేయ ప్రసాద్ మరణించాడు. తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుక్కి.. తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో తల్లడిల్లిపోయారు. ఆ బాధ నుంచి బయటపడ్డారా? అని అడిగినప్పుడు మర్చిపోవడానికి ఇదేమైనా జ్ఞాపకమా? జీవితం.. ఎలా మర్చిపోతాను? ఓ నిట్టూర్పు విడిచారు. కానీ నటనలో బిజీగా ఉండటం వల్ల ఆ బాధను ఎంతో కొంత తట్టుకోగలిగాను అని అనేవారు.
పెళ్లయ్యాక కష్టాలు
ఇదొక్కటే కాదు.. ఆయన జీవితంలో కష్టాలకు కొదవలేదని కోట మాటల్లోనే తెలిసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నాకు 1968లో రుక్మిణితో పెళ్లయింది. 1973లో నా భార్య డెలివరీ అయినప్పుడు ఓ విషాదం జరిగింది. ఆమె తల్లి చనిపోయారు. అప్పుడు నా భార్యకు చిన్నగా షాక్‌లాంటిది వచ్చింది. దాన్ని నేను గమనించలేకపోయాను. తర్వాత తను సైకియాట్రిక్ పేషెంట్‌గా మారిపోయింది. 30 ఏళ్లపాటు నేనెవరో కూడా గుర్తుపట్టలేదు. తను తిట్టినా ఓర్పుగా సహించాను. ఎందుకంటే తను నా భార్య. ఈ విషయం నాకు క్లోజ్‌గా ఉండేవారికి మాత్రమే తెలుసు. ఎవరికీ చెప్పలేదు.

ఒంటరిగా కన్నీళ్లు
నా రెండో కూతురు ఎంకాం చదివింది. ఎప్పుడూ రిక్షా ఎక్కలేదు అని విజయవాడలో బంధువులతో కలిసి రిక్షా ఎక్కింది. ఎదురుగా బ్రేకులు ఫెయిలైన లారీ రిక్షాను గుద్దింది. ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా నా కూతురు కాలు కోల్పోయి ప్రాణాలతో బయటపడింది. బ్యాంకులో ఎవరిదగ్గరైతే గుమాస్తాగా పనిచేశానో ఆయనే నాకు వియ్యంకుడయ్యాడు. నా కూతురు జీవితం బాగుపడిందని సంతోషించేలోపే నా కుమారుడు చనిపోయాడు. ఆ భగవంతుడు ఎంత పేరిచ్చాడో అన్ని కష్టాలిచ్చాడు. ఇవన్నీ గుర్తుచేసుకుని అప్పుడప్పుడు ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటాను అని కోట ఎమోషనలయ్యారు. కాగా కోట శ్రీనివాసరావు జూలై 13న అనారోగ్యంతో కన్నుమూశారు.
కోట ఎప్పుడూ చెప్తూ ఉండే మాట.. "నేను చచ్చేదాకా నటించాలి. చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి"
(చదవండి: అందరి గుండెల్లో 'కోట'.. తనదీ చార్మినార్‌కున్నంత హిస్టరీ 'తమ్మీ')