షూటింగ్స్‌తో ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే హీరోలు ఏమాత్రం విరామం దొరికినా కుటుంబంతో కలిసి విదేశాల్లో వాలిపోతుంటారు. ప్రశాంతంగా ఫ్యామిలీతో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. హీరో ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం వెకేషన్ టైమ్‌లో ఉన్నారు. ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్, సలార్’ మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఈ మూవీలో ‘కాంతారా’ ఫేమ్ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ మూవీ నిర్మిస్తున్నారు. కాగా ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో ‘డ్రాగన్’ షూటింగ్‌కి బ్రేక్ పడింది. హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించుకున్న ఎన్టీఆర్ కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
చాలా రోజుల తర్వాత ఆయన సెప్టెంబరు 29న జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆపరేషన్ జరిగిన చేయి ఇప్పుడు బాగుందని చె΄్పారాయన. అంటే త్వరలోనే తిరిగి ‘డ్రాగన్’ షూటింగ్‌లో పాల్గొంటారు. అయితే ఈలోపు కుటుంబంతో కలిసి సరదాగా ఇటలీ ట్రిప్‌కి వెళ్లారు ఎన్టీఆర్. ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, స్నేహితులు కలిసి ఎంజాయ్ చేస్తున్న అక్కడి ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. వెకేషన్ నుంచి ఇండియా వచ్చిన వెంటనే ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూట్‌లో పాల్గొంటారని సమాచారం.


