టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం జానీ మాస్టర్ స్పందించారు. శేఖర్ మాస్టర్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని అన్నారు. మా ఇద్దరి మధ్య విభేదాలు అని వస్తోన్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఆదివారం డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో వివాదం తలెత్తినట్లు తెలిసింది. శేఖర్ మాస్టర్ ఆగ్రహంతో మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలోవైరలయ్యాయి. దీంతో డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గ్రూపులు ఘర్షణకు దిగారని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. మా యూనియన్‌లో ఎలాంటి గొడవలు లేవని అన్నారు. నేను, శేఖర్ మాస్టర్ ఈ రోజు మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోజనం కూడా చేశామని వెల్లడించారు. మాకు చిరంజీవి ఎల్లప్పుడు మద్దతుగా నిలుస్తారని అన్నారు. ఇది యూనియన్‌లో జరుగుతున్న చిన్న సమస్య మాత్రమేనని తెలిపారు. అంతే కానీ మా డ్యాన్స్ మాస్టర్‌ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. కేవలం చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయభేదాలు మాత్రమే వచ్చాయని క్లారిటీ ఇచ్చారు.


