రామ్ చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి..రికార్డును సృష్టించింది. మరోవైపు అదే స్థాయిలో పెద్దిపై విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను చూపించిన తీరుపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ మహిళలే కాదు సినీ తారలు కూడా జాన్వీ పాత్రను తీర్చిదిద్దిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే నిత్యా మీనన్, డింపుల్ హయాతీ, అషికా లాంటి తారలు ఈ వివాదంపై స్పందిస్తూ.. సినిమాల్లో హీరోయిన్లను గ్లామర్ బొమ్మలా చూపిండాన్ని తప్పుపట్టారు. తాజాగా పెద్ది సినిమాలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతి బాబు కూడా ఈ వివాదంపై స్పందించాడు. సినిమా క్యారెక్టరైజేషన్ విషయంలో నటీనటులను వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం ఏమాత్రం సరికాదంటూ జాన్వీకి అండగా నిలిచాడు.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సినిమా విషయంలో ఆర్టిస్టులను ట్రోల్ చేయొద్దు. పాపం ఆ అమ్మాయి(జాన్వీ కపూర్) జోలికి వెళ్లడం కరెక్ట్ కాదు. తాను సొంతంగా అలా చేయలేదు కాదా? దర్శకుడు ఇలా చెయ్ అంటేనే ఆమె చేస్తుంది. ఇష్టం ఉందో లేదో మనకేమి తెలియదు కానీ దర్శకుడిని నమ్మి వచ్చినప్పుడు.. ఆయన మాట వినాలి. డైరెక్టర్ చెప్పింది చేస్తాం. తన జస్టిఫికేషన్ తనకు ఉంది. కానీ కొన్నిసార్లు అది మిస్ ఫైర్ అవుతుంది. ఈ విషయంలో నేను జాన్వీకపూర్‌కు సపోర్ట్ చేస్తాను. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు. ట్రోల్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు’ అని జగపతి బాబు అన్నాడు.
ఇక తాను పోషించిన అప్పల సూరి పాత్రకు వచ్చిన రెస్పాన్స్ గురించి మాట్లాడుతూ.. పెద్ది’ విడుదలయ్యాక నాకు ఓ పెద్ద డైరెక్టర్ ఫోన్ చేశారు. ‘‘పెద్ది’లో మీరు చాలా గొప్ప పాత్ర చేసినా ఎందుకు ఎవరూ గుర్తించట్లేదు. అదే పాత్రను వేరే భాషకు చెందిన నటులు చేసి ఉంటే బాగా హైలైట్ చేసేవారు. వాళ్లకు 20 సినిమాలు ఆఫర్ చేసేవారు. మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు ఏంటి?’ అని అన్నారు. ఏ ఇండస్ట్రీలో అయినా పరభాష నటులకు ఎక్కువ గౌరవం ఇస్తారు. నేను కన్నడలో చేస్తే అక్కడ బాగా గౌరవిస్తారు. పెద్ది సినిమా కోసం నేను ప్రాణం పెట్టాను. అందుకే గుర్తింపు కోసం అడిగే హక్కు నాకు ఉంది. మిగతా సినిమాలకు నేను ఎప్పుడూ ఇలా అడగలేదు. ‘పెద్ది’ ఇంకా ఆదరణ దక్కాల్సిన చిత్రం. కచ్చితంగా ఆదరణ దక్కుతుంది. ఇందులో పనిచేసిన ప్రతిఒక్కరూ దీన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతారు’ అని అన్నారు.


