
తెలుగులో లెక్కలేనన్నీ మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ జోరుగా నడుస్తోంది. అలా తెలుగు దర్శకులు.. ఇతర భాషల్లోనూ మూవీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తీసిన హిందీ సినిమా 'జాట్'. ఏప్రిల్‌లో హిందీ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే?
(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ'.. తెలుగు రివ్యూ)
కథేంటి?
శ్రీలంక నుంచి అక్రమంగా ఇక్కడికి వలసొచ్చిన రణతుంగ(రణదీప్ హుడా).. ప్రకాశం జిల్లాలోని మోటుపల్లితో పాటు చుట్టుపక్కన 30 గ్రామాల్ని తన ఆధీనంలో పెట్టుకుంటాడు. మరోవైపు అయోధ్య వెళ్తున్న జాట్(సన్నీ డియోల్).. ట్రైన్‌లో సాంకేతిక లోపం కారణంగా మోటుపల్లిలో దిగుతాడు. ఆకలేసి ఓ షాపులో ఇడ్లీ తినబోతుంటే.. కొందరు రౌడీలు జాట్ ప్లేట్‌ని తోసేస్తారు. దీంతో వాళ్లని సారీ చెప్పమంటాడు. వాళ్లు చెప్పరు. ఫలితంగా ఈ పంచాయతీ.. రణతుంగ దగ్గరకు చేరుతుంది. తర్వాత ఏమైంది? ఇంతకీ జాట్, రణతుంగ గతమేంటి అనేది మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
జాట్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికే తెలుగు సినిమాల్లో అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి లాంటి స్టోరీ ఇది. కొన్ని గ్రామాల ప్రజల్ని ఇబ్బంది పెట్టే కరుడుగట్టిన విలన్.. అనుకోకుండా హీరో ఆ ఊరికి రావడం, సమస్య తెలుసుకుని విలన్‌తో తలపడటం.. చివరకు కథ సుఖాంతం. ఎన్నిసార్లో తెలుగు ప్రేక్షకులు ఈ తరహా సినిమాల్ని చూసి చూసి విసుగెత్తిపోయారు. బహుశా అందువల్లనేమో మన దగ్గర థియేటర్లలో నేరుగా రిలీజ్ చేయలేదు. హిందీలో రిలీజ్ చేస్తే ఓ మాదిరి రెస్పాన్స్ దక్కించుకుంది.
ట్రైన్‌లో వెళ్తుండే హీరో.. అనుకోకుండా విలన్ ఉండే ఊరిలో దిగడం, తర్వాత కొందరు రౌడీలతో ఇడ్లీ పంచాయతీ. అది కాస్త మెయిన్ విలన్ దగ్గరకు వెళ్లడం.. ఇలా ఫస్టాప్ ముగుస్తుంది. ఊహించినట్లే సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోటుపల్లి గ్రామస్థులని విలన్, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏంటి? లాంటి సీన్స్ ఓకే ఓకే అనిపిస్తాయి. హీరో బ్యాక్ గ్రౌండ్ రివీల్ చేసి, విలన్‌ని చంపే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో క్లైమాక్స్‌ని రొటీన్‌గా ముగిస్తారు.
రెండున్నర గంటల సినిమానే గానీ చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించేలా సాగుతుంది. యాక్షన్ సీన్లలో డోస్ ఎక్కువైపోయింది. హీరో అడుగేస్తే భూమి బద్దలవడం, కొట్టగానే రౌడీలు గాల్లో అంతెత్తున ఎగరడం లాంటి సీన్స్ యాక్షన్ ప్రియులకు నచ్చుతాయేమో గానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం నవ్వు తెప్పిస్తాయి.
ఎవరెలా చేశారు?
హీరోగా చేసిన సన్నీ డియోల్.. కొందరు తెలుగు ప్రేక్షకులకు తెలుసంతే. సినిమాలో ఆయన పాత్రని చూస్తున్నప్పుడు ఇది బాలకృష్ణ చేయాల్సిన రోల్ కదా అనిపిస్తుంది. విలన్‌గా రణదీప్ హుడా బాగానే చేశాడు. కాకపోతే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఎక్కడు. మిగిలిన వాళ్లలో రెజీనా, సయామీ ఖేర్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.
సినిమాని చాలా రిచ్‌గా తీశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు బాగోలేవు. యాక్షన్ సీన్స్ హిందీ ప్రేక్షకులకు నచ్చొచ్చేమో గానీ తెలుగు ప్రేక్షకులు అయితే ఇదివరకే ఇలాంటి చాలా చూసేశాం కదా అని కచ్చితంగా అనుకుంటారు. దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా రొటీన్ రెగ్యులర్ మసాలా మూవీనే హిందీ హీరోతో తీసేశాడు. ఒకవేళ మీకు టైమ్ ఉండి, ఏదైనా రొటీన్ మాస్ మసాలా మూవీ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.
-చందు డొంకాన
(ఇదీ చదవండి: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ)