ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన సినిమా.. తెలుగు రివ్యూ | Tourist Family Review Telugu | Sakshi
Sakshi News home page

Tourist Family Review: సూపర్ హిట్ 'టూరిస్ట్ ఫ్యామిలీ'.. ఓటీటీ రివ్యూ

Jun 2 2025 2:07 PM | Updated on Jun 2 2025 2:52 PM

Tourist Family Review Telugu

ఎప్పుడూ అదే థ్రిల్లర్, యాక్షన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసిందా? కాసేపు మనసారా నవ్వుకుని, కాస్త ఫీల్ అవుదామని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఓటీటీలోకి ఓ అద్భుతమైన సినిమా వచ్చేసింది. అదే 'టూరిస్ట్ ఫ్యామిలీ'. గత నెలలో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. ఇప్పుడు హాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. మరి అంతగా ఈ సినిమాలో ఏముంది? అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
శ్రీలంకకు చెందిన ధర్మదాస్ (శశికుమార్).. సొంత దేశంలో బతుకు కష్టమైపోవడంతో భార్య వాసంతి(సిమ్రన్), ఇద్దరు కొడుకులతో కలిసి మన దేశానికి అక్రమంగా వలస వస్తాడు. చెన్నైలోని ఓ కాలనీలో అద్దెకు దిగుతాడు. ఇతడికో బావమరిది (యోగిబాబు) సాయం చేస్తాడు.  ఎవరితోనూ పెద్దగా మాడ్లడొద్దు, మీ గతం గురించి చెప్పొద్దని ధర్మదాస్‌కి సలహా ఇస్తాడు. కానీ ధర్మదాస్ కుటుంబం.. సదరు కాలనీ వాసులతో కలిసి పోతారు. తమ గురించి నిజం చెప్పేస్తారు. మరోవైపు రామేశ్వరం పోలీసులు.. ధర్మదాస్ కుటుంబం కోసం ఎందుకు వెతుకుతున్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
మనుషులు మంచోళ్లు.. అసలు మనుషులు అంటేనే మంచోళ్లు అని 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో డైలాగ్ ఉంటుంది. అలా మనుషుల్లో ఉండే మానవతా విలువలని తట్టి లేపే ప్రయత్నమే ఈ మూవీ. శ్రీలంక నుంచి అక్రమంగా మన దేశానికి వలస వచ్చిన ఓ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడింది? నిజం చెప్పినా సరే మనవాళ్లు వారికి ఎలా సహాయపడ్డారు. ఒకరికి ఒకరు ఎందుకు సాయం చేసుకోవాలి అనే అంశాల్ని మనసుకు హత్తుకునేలా ఈ చిత్రంలో చూపించడం విశేషం.

శ్రీలంక నుంచి ధర్మదాస్ కుటుంబం.. ఓ పడవలో అక్రమంగా రామేశ్వరం వస్తారు. అక్కడ పోలీసులకు దొరికిపోతారు. కానీ ఎలాగోలా మేనేజ్ చేసి చెన్నైకి వచ్చేస్తారు. ఓ కాలనీలో అద్దెకు దిగాతారు. నిజానికి ఆ కాలనీలో పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియనంతంగా ఫాస్ట్ లైఫ్‌‌కి  జనాలు అలవాటు పడిపోయి ఉంటారు. అలాంటి కాలనీలో ఉండేవాళ్లతో.. ధర్మదాస్ కుటుంబం ఎలా మార్పులు తీసుకొచ్చింది. అనేదే మిగతా స్టోరీ. సినిమా చూస్తున్నంతసేపు మనం కూడా ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతాం.

ఓవైపు సరదాగా సున్నితమైన హస్యంతో నవ్విస్తూనే, మరోవైపు గుండెని పిండేసే ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. చెప్పాలంటే హ్యుమర్ విత్ హ్యుమానిటీ అనే సరికొత్త జానర్ సినిమాలా అనిపిస్తుంది. ఈ రెండు అంశాల్ని మూవీలో బ్యాలెన్స్ చేసిన విధానం చూస్తే తెగ ముచ్చటేస్తుంది. సినిమాలో కొన్ని సీన్లు అయితే భలే కనెక్ట్ అవుతాయి. ఓ ముసలావిడ చనిపోతే కాలనీ అంతా ఒక్కటైన తీరు మనల్ని కంటతడి పెట్టేలా చేస్తుంది.

తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోయిందని ధర్మదాస్ పెద్ద కొడుకు బాధపడుతుంటాడు. ఈ సీన్ చూస్తున్న మనకు కూడా అయ్యో అనిపిస్తుంది. వెంటనే చిన్న కొడుకు చేసే హంగామా వల్ల మొత్తం సీనే మారిపోయి ఫుల్ నవ్వొచ్చేస్తుంది. చర్చిలో అదే కాలనీకి చెందిన ఓ తాగుబోతు కుర్రాడు తన జీవితం గురించి చెప్పే సీన్ హైలెట్. ధర్మదాస్ పెద్ద కొడుకు, వాళ్ల ఇంటి యజమాని కూతురు మధ్య క్యూట్ ప్రపోజల్ సీన్‌కి యూత్ కచ్చితంగా కనెక్ట్ అవుతారు. రెండు గంటల సినిమానే కానీ చూస్తున్నంతసేపు అసలు సమయమే తెలియనంత వేగంగా అయిపోతుంది. ఇంకాసేపు ఉండుంటే బాగుండు అనిపిస్తుంది.

ఎవరెలా చేశారు?
ధర్మదాస్‌గా శశి కుమార్ సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇతడి భార్యగా సిమ్రన్.. వాసంతి అనే పాత్రలో ఒదిగిపోయింది. వీళ్ల పెద్ద కొడుకు పాత్ర ఓకే. కానీ చిన్న కొడుకు మురళిగా చేసిన పిల్లాడైతే ఇరగదీశాడు. ఓ రకంగా సినిమాలో కామెడీ సీన్లన్నీ ఇతడి మీదే ఉంటాయి. కచ్చితంగా ఈ పాత్ర మీకు నచ్చేస్తుంది. మిగిలిన వారిలో తాగుబోతు కుర్రాడు, ఓ కుక్కపిల్ల.. ఇలా ప్రతి పాత్ర సినిమాలో కీలకమే. ఎవరూ తక్కువ కాదు ఎవరూ ఎక్కువ కాదు అనేలా జీవించేశారు.

టెక్నికల్ విషయాలకొస్తే సినిమా అంతే ఓ కాలనీలో తీశారు. చూస్తున్నంతసేపు మనం కూడా అక్కడే ఉన్నామా అనేలా సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. మిగతా అన్నీ విభాగాలు తమ తమ పనిని పక్కాగా చేశాయి. చివరగా డైరెక్టర్ అభిషణ్ జీవింత్ గురించి చెప్పుకోవాలి. స్వతహాగా ఇతడో యూట్యూబర్. వయసులోనే చిన్నోడు. కానీ ఇలాంటి సినిమా తీసి అందరి మనసులు గెలుచుకున్నాడు. రాజమౌళి, నాని కూడా ఈ మూవీ చూసి మెచ్చకున్నారంటే మనోడి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఓటీటీలో 'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. మీ కుటుంబం అంతా కలిసి కచ్చితంగా సినిమా చూడండి. అస్సలు మిస్ కావొద్దు.

-చందు డొంకాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement