‘కేజీఎఫ్’ వంటి చారిత్రక విజయం తర్వాత రాకింగ్ స్టార్, దక్షిణాది క్రేజీ హీరో యష్ నటించిన ‘టాక్సిక్’ ట్రైలర్ తోనే సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హీరో యష్ తన స్వంత బ్యానర్ మాన్‌స్టర్ క్రియేషన్స్ ద్వారా సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్న పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ మూవీ టాక్సిక్. ఇందులో యష్ అత్యంత క్రూరమైన గ్యాంగ్ లీడర్ ‘రాయా’ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ‘ది టీజ్’ తోనే ఈ మూవీ భారీ అంచనాలు పెంచి సంచలనాలు కూడా రేపింది.
కెమెరా టేకింగ్ యాక్టింగ్ వగైరాలన్నీ సినీ సాంకేతిక నిపుణుల మధ్య చర్చనీయాంశంగా మారి పలు ప్రశంసలు కూడా అందుకుంటుంటే... మరోవైపు నీలిచిత్రాల స్థాయిలో ఉన్న సన్నివేశం సంప్రదాయవాదుల కన్నెర్రకు కారణమైంది. ఈ నేపధ్యంలోనే ఆ సినిమాకు దర్శకత్వం వహించింది ఎవరు?తన నేపధ్యం ఏమిటి? అంటూ కన్నడేతర భాషా ప్రేక్షకుల్లో చర్చ కూడా జోరుగా సాగుతోంది. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే షాకింగ్ సీన్లను జోడిస్తూ రూపొంది త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతున్న ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్–అప్స్’.చిత్రం∙దర్శకురాలి పేరు గీతూ మోహన్‌దాస్.
యాక్షన్ టూ డైరెక్షన్...ఆమె ఒక సెన్సేషన్...
పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలకు అలవాటైన దర్శకుల నుంచి కాకుండా, యష్ పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు.దానికి తగినట్టుగా ఆయనకు కనిపించారు దర్శకురాలు గీతూ మోహన్‌దాస్. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, తరువాత ఆస్కార్ స్థాయికి ఎదిగిన ప్రతిభావంతురాలైన దర్శకురాలిగా పేరొందారు. సాధారణ వాణిజ్య చిత్రాలకు పూర్తి భిన్నం గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘లైయర్స్ డైస్’ (2013). ప్రముఖ నటీనటులు నవాజుద్దీన్ సిద్ధిఖీ, గీతాంజలి థాపాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, హిమాలయాల్లోని ఓ గ్రామం నుంచి ఢిల్లీ వరకు తన భర్త కోసం ఒక మహిళ చేసే ప్రమాదకర ప్రయాణాన్ని భావోద్వేగ సహితంగా చూపిస్తుంది.
ఈ చిత్రం సండాన్స్ రోటర్‌డామ్ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ప్రశంసలు అందుకోవడంతో పాటు 87వ ఆస్కార్ అవార్డ్స్‌కు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైన ఘనత దక్కించుకుంది. అంతేకాదు 61వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమనటి, ఉత్తమ సినిమాటోగ్రఫీలకు గాను రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి గీతూ మోహందాస్ భర్త కావడం.
ఆయన అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ కు తన రఫ్ అండ్ రియలిస్టిక్ విజువల్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చి విజువల్ మాస్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. గీతూ మోహన్‌దాస్ వైవిధ్యభరిత లైన్స్‌కు తెరపై జీవం పోసే లెన్స్ రాజీవ్ రవి అని చెప్పొచ్చు. అలాగే దేవ్ డి, చాందినీ బార్, ఉడ్తా పంజాబ్ వంటి వైవిధ్యభరిత సినిమాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.
‘టాక్సిక్’ కోసం గీతూనే ఎందుకు?
‘కేజీఎఫ్’ లాంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత, యష్ గీతూ మోహన్‌దాస్ లాంటి ఆలోచనాత్మక చిత్రాలకు పేరొందిన దర్శకురాలిని ఎంపిక చేయడం ఇండస్ట్రీలో ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఆమె రెండో చిత్రం ‘మూతోన్’ (సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ అవార్డు విజేత) చూసినవారికి ఈ నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతుంది. గీతూ కథనాల్లో ఉండే డార్క్ రియలిజం, అంతర్జాతీయ టచ్ – యశ్ మాస్ ఇమేజ్‌తో కలిసినప్పుడు, ఒక కొత్త తరహా భారతీయ బ్లాక్‌బస్టర్ రూపుదిద్దుకోబోతోందన్న అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో యష్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏదేమైనా... భారతీయ చిత్రాల్లో కామసూత్ర తీసిన మీరానాయర్ ఎంత వివాదాస్పదం అయ్యారో తెలిసిందే. అయితే సబ్జెక్ట్ పరంగా అవసరం కాబట్టి తీశానంటూ ఆమె సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగారు. మరి కేవలం ఒకే ఒక్క టీజర్ ద్వారా సంప్రదాయవాదుల దాడులతో పాటుగా న్యాయ వివాదాలు కూడా ఎదుర్కుంటున్న గీతూ మోహన్...పూర్తి సినిమా విడుదల తర్వాత ఏవేం వివాదాలు ఎదుర్కోనున్నారో వేచి చూడాలి.


