గ్రీకు వీరుడు రెండో రూపంలో... | Hollywood film Gladiator 2 ott review in telugu | Sakshi
Sakshi News home page

గ్రీకు వీరుడు రెండో రూపంలో...

Apr 7 2025 3:40 AM | Updated on Apr 7 2025 3:40 AM

Hollywood film Gladiator 2 ott review in telugu

ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో హాలీవుడ్‌ చిత్రం గ్లాడియేటర్‌ 2 ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

చరిత్రలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది గ్రీకు సంస్కృతి. ఎన్నో వైవిధ్యమైన పోరాటాలకు, వీరోచితంగా పోరాడిన వీరుల కథలతో రోమ్‌ రాచరికపు చరిత్ర నిండి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని భాషలలో గ్రీకు కథలకు సంబంధించి ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ 25 ఏళ్ల క్రితం హాలీవుడ్‌లో వచ్చిన ‘గ్లాడియేటర్‌’  సినిమా మాత్రం ప్రపంచ సినీ ప్రేక్షకులకు చాలా ప్రత్యేకం. అప్పట్లో 110 మిలియన్‌ డాలర్లతో రూపొందిన ఈ సినిమా 465 మిలియన్‌ డాలర్ల వరకు రాబట్టిందంటేనే తెలుస్తుంది ఈ సినిమా శక్తి ఏంటో. ప్రముఖ హాలీవుడ్‌ హీరో రస్సెల్‌ క్రోవ్‌ నటించిన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయింది. 

ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘గ్లాడియేటర్‌ 2’ రిలీజైంది. నాటి ‘గ్లాడియేటర్‌’తో పోలిస్తే అంత పెద్ద హిట్‌ కాకపోయినా నేటి టెక్నాలజీతో సినిమా ఆద్యంతం మంచి విజువల్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. పాల్‌ మెస్కల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు నాటి ‘గ్లాడియేటర్‌’ దర్శకుడైన రిడీ స్కాటే దర్శకత్వం వహించారు. ఇక కథాపరంగా ‘గ్లాడియేటర్‌ 2’లో ఏముందంటే హీరో అయిన హన్నో భార్య అరిషత్‌ను చంపి, హన్నోను రోమన్‌ జనరల్‌ అకాసియస్‌ బానిసగా తీసుకెళతాడు.

హన్నో కొలోసియంలో గ్లాడియేటర్‌గా పోరాడుతూ ఉండగా తన తల్లి ఆ రాజ్యపు పట్టపు రాణి అయిన లూసిల్లా అని, తాను మాక్సిమస్‌ వారసుడని తెలుసుకుంటాడు. మాక్సిమస్‌ కుట్రతో లూసిల్లాను కొలోసియంలో ఉరి తీయాలనుకుంటాడు. బానిసగా వచ్చిన హన్నో తన తల్లిని కాపాడుకుంటాడా? అలాగే తనను బానిసగా తెచ్చిన అకానియస్‌... హన్నోకి అండగా ఉంటాడా? అనేది మాత్రం ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమ్‌ అవుతున్న ‘గ్లాడియేటర్‌ 2’లోనే చూడాలి. 

మొదటి గ్లాడియేటర్‌ కన్నా ఈ గ్లాడియేటర్‌లో ఎక్కువ పోరాట సన్నివేశాలతో పాటు గ్రీకు సంస్కృతి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా కథలో జొప్పించారు. తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ కూడా ఉంది కాబట్టి నాటి రోమ్‌ కథను హాయిగా మన భాషలో చూసేయొచ్చు. అయితే పిల్లలతో కాకుండా పెద్దవాళ్లు మాత్రం చూడదగ్గ మంచి అడ్వెంచరెస్‌ ఫిల్మ్‌.    – హరికృష్ణ ఇంటూరు 

Advertisement
 
Advertisement
Advertisement