
కొన్నాళ్ల కిందట పవన్ కల్యాణ్.. ఆంధ్రాలోని పలు థియేటర్లలో కక్ష కట్టి తనిఖీలు చేయించారు. టికెట్ ధరలు, తినుబండారాల ధరలు తగ్గించాలని చాలా హడావుడి చేశారు. ఇప్పుడు తన సినిమా వస్తుండేసరికి స్వలాభం చూసుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే రేట్లు అలా పెంచేశారు. పవన్ నటించిన 'హరిహర వీరమల్లు'.. వచ్చే గురువారం(జూలై 24) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఒక్కో టికెట్ రేటు ఏకంగా రూ.600 వరకు ఉండేలా అనుమతి ఇవ్వడం ఇక్కడ ఆశ్చర్యపరుస్తోంది.
(చదవండి: హరి హర వీరమల్లు.. అందుకే హిందీలో ప్రమోషన్స్ చేయట్లేదు: నిర్మాత)
ఏపీలో గత ప్రభుత్వంలో బెనిఫిట్ షోలు రద్దు చేయగా.. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' కోసం మళ్లీ వాటిని తీసుకొచ్చారు. 23న అంటే విడుదలకు ముందు రోజు రాత్రి 9 గంటల ప్రీమియర్ షోలకు అనుమతించారు. ఈ షోకి ఒక్కో టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ రూ.100, అప్పర్ క్లాస్ రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్‌ల్లో అయితే ఏకంగా రూ.200 పెంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. రిలీజ్ రోజైన నాటి నుంచి 10 రోజుల పాటు రేట్ల పెంపు అమల్లో ఉండనుంది.
(ఇదీ చదవండి: 'మెగా' లీకులు.. నిర్మాతలు గట్టి వార్నింగ్)
సినిమా ఇండస్ట్రీకి చెందిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నారు. అంటే జనాలకు ఏది మంచిదో అది ఆయన చేయాల్సి ఉంటుంది. అలాంటి ఆయనే తన సినిమాకు ఎక్కువ రేటు వచ్చేలా చూసుకున్నారు. ఈ రేట్లకు అభిమానులు వెళ్లొచ్చేమో గానీ సాధారణ జనాలు వెళ్తారా అనేది చూడాలి. ఎందుకంటే రీసెంట్ టైంలో జనాలు థియేటర్లకు వెళ్లడమే చాలా తగ్గించేశారు. అలాంటిది ఇంతింత రేట్లు పెంచితే ఎలా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
'హరిహర వీరమల్లు' సినిమా దాదాపు ఐదేళ్లపాటు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ తీశారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ డియోల్ విలన్. తొలుత క్రిష్ డైరెక్టర్ కాగా.. మధ్యలో ఆయన తప్పుకొన్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు అందుకున్నారు. ఆయన మిగతా అంతా పూర్తి చేశారు.
(ఇదీ చదవండి: 'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?)