
పాన్ ఇండియా సినిమా అంటే..రిలీజ్‌కి రెండు మూడు నెలల ముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు. దేశం మొత్తం తిరిగి ప్రచారం చేస్తారు. హీరోహీరోయిన్లతో కలిసి పెద్ద ఎత్తున ఈవెంట్స్ నిర్వహిస్తారు. ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్స్, మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తారు. కానీ పవన్ కల్యాణ్(pawan kalyan) తాజాగా సినిమా హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu) విషయంలో మాత్రం అవేవి కనిపించడం లేదు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నా.. ఆ స్థాయిలో మాత్రం ప్రమోషన్స్ లేవు. మరో ఐదు రోజుల్లో(జులై 24) ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికీ ప్రమోషన్స్‌లో వేగం పెరగలేదు. బాలీవుడ్‌లో ఒక్క ఈవెంట్ కూడా పెట్టలేదు. టాలీవుడ్‌లో తప్ప వేరే చోట ఈ సినిమా ప్రెస్ మీట్స్ కనిపించడం లేదు. ఇక హీరో గురించి అందరికి తెలిసిందే. ఆయన ప్రచార కార్యక్రమాల్లో మొత్తానికే పాల్గొనడం లేదు.
హీరో ప్రమోషన్స్‌లో పాల్గొంటేనే ఆ సినిమా త్వరగా జనాల్లోకి వెళ్తుంది. అందుకే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. సినిమా విడుదలకి ముందు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంత బిజీగా ఉన్నా సరే రిలీజ్ అయ్యే సినిమాకు కాస్త సమయం కేటాయిస్తారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. స్టార్ హీరో, అందులోనూ డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి.. నిర్మాత కూడా ఆయనను అడిగే సాహసం చేయడం లేదు. ఆయన ప్రమోషన్స్‌కి రాకపోవడం నష్టం అని తెలిసినా కూడా సైలెంట్‌గా ఉండిపోతున్నారు.
బాలీవుడ్‌లో ప్రమోషన్స్ చేయకపోవడానికి కారణం కూడా పవన్ కల్యాణే. ఆయన సమయం కేటాయించకపోవడం వల్లే బాలీవుడ్‌లో ప్రమోషన్స్ చేయడం లేదట. ఈ విషయాన్ని తాజాగా స్వయంగా చిత్ర నిర్మాతనే చెప్పారు. ‘బాలీవుడ్‌లో ఈవెంట్ పెట్టి సినిమాను ప్రమోట్ చేయాలని మాకూ ఉంది. కానీ కుదరడం లేదు. పవన్ కల్యాణ్ బాగా బిజీ అయిపోయారు. ఆయన వచ్చి ప్రమోషన్స్‌లో పాల్గొనడం కష్టమే. హీరో లేకుండా అక్కడ ఏ ఈవెంట్ చేసినా.. పెద్దగా ఉపయోగం ఉండదు. నేను ఒక్కడినే వెళ్తే అక్కడకు ఎవరు వస్తారు? అందుకే బాలీవుడ్‌లో ప్రమోషన్స్ చేయడం లేదు. నేనే వెళ్లి అక్కడ(ముంబై) ఒక ప్రెస్ మీట్ పెట్టి వద్దాం అనుకుంటున్నాను’ అని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. ‘నిర్మాత చెప్పింది కూడా నిజమే. సినిమా హీరో హీరోయిన్లు లేకుండా ఈవెంట్ నిర్వహిస్తే..అది జనాల్లోకి వెళ్లడం కష్టమే. పవన్ కల్యాణ్ ప్రమోషన్స్‌లో పాల్గొనకపోవడం సినిమాకు ఎంతో కొంత నష్టమే’ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.