గాంధీ జయంతి స్పెషల్‌.. ఓటీటీలో చూడాల్సిన 5 సినిమాలు | Gandhi Jayanthi Top 5 Telugu Movies In OTT | Sakshi
Sakshi News home page

Gandhi Jayanthi OTT: గాంధీ జయంతి స్పెషల్‌.. ఓటీటీలో చూడాల్సిన సినిమాలు

Oct 2 2026 4:13 PM | Updated on Oct 2 2026 4:36 PM

Gandhi Jayanthi Top 5 Telugu Movies In OTT

 ఈ రోజు (అక్టోబరు 2) గాంధీ జయంతి. మహాత్మా గాంధీ జీవితం, ఆయన పాటించిన అహింసా సిద్ధాంతాలు, గాంధేయ భావజాలం ఇప్పటికీ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. గాంధీ ఆలోచనలు, అహింస, సామాజిక మార్పు వంటి అంశాలను వెండితెరపై ఆవిష్కరించిన పలు సినిమాలు ఉన్నాయి. ఈ గాంధీ జయంతి సందర్భంగా ఓటీటీలో అందుబాటులో ఉన్న అలాంటి ఐదు చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

మహాత్మ: కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మహాత్మ’. ఆయన కెరీర్‌లో ఇది 100వ సినిమా. రౌడీయిజం, సెటిల్మెంట్లతో జీవించే దాసు అనే యువకుడు గాంధేయ మార్గం వైపు ఎలా అడుగులు వేశాడనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. హింస కంటే అహింసే గొప్ప ఆయుధమనే విషయాన్ని భావోద్వేగంగా చూపించారు. భావన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి విజయ్ ఆంటోని సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5తో పాటు యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది.
ఇదీ చదవండి: ‘ఆ విషయంలో రాజీపడను.. సినిమాలు కూడా వదులుకున్నా’

శంకర్ దాదా జిందాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’లో గాంధీగిరి భావజాలాన్ని వినోదాత్మకంగా చూపించారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో విజయవంతమైన ‘లగే రహో మున్నాభాయ్’ను తెలుగులో కూడా చిత్రీకరించి తీశారు. ఒక స్థానిక దాదా గాంధేయ మార్గాన్ని అనుసరిస్తూ ఎదుటివారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. కోపానికి బదులుగా ప్రేమను పంచడం, సమస్యలను అహింసా మార్గంలో పరిష్కరించుకోవడం వంటి అంశాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమా సన్‌ఎన్‌ఎక్స్‌టీ, ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో అందుబాటులో ఉంది.

గాంధీ: రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాంధీ’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్లాసిక్. బెన్ కింగ్స్‌లే మహాత్మా గాంధీ పాత్రలో నటించారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీ పోరాటం నుంచి భారత స్వాతంత్య్ర ఉద్యమం వరకు ఆయన జీవిత ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించారు. అహింసా మార్గంలో స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపించిన గాంధీజీ సిద్ధాంతాలను ఈ చిత్రం కళ్లకు కడుతుంది. ఈ సినిమా ఎనిమిది ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సోనీ లివ్, ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్‌లోనూ అందుబాటులో ఉంది.

గాంధీ టాక్స్: విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరీ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘గాంధీ టాక్స్’. డైలాగులు లేకుండా తెరకెక్కిన ఈ మూకీ చిత్రం డబ్బు చుట్టూ తిరిగే సమాజాన్ని విభిన్న కోణంలో చూపిస్తుంది. కరెన్సీ నోట్లపై కనిపించే గాంధీజీ రూపం, నేటి సమాజంలో పెరిగిన ధనాశ మధ్య ఉండే సంఘర్షణను కథాంశంగా తీసుకున్నారు. ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదీ చదవండి: మూవీ ప్రమోషన్స్‌లో మహేశ్‌ బాబు కూతురు.. అభిమానులు ఫిదా

హే రామ్: కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హే రామ్’ కూడా గాంధీ భావజాలాన్ని చర్చించే ముఖ్యమైన చిత్రం. దేశ విభజన సమయంలో చోటుచేసుకున్న మతకల్లోలాలు, ఆ సమయంలో గాంధీజీ చేసిన శాంతి ప్రయత్నాలను ఈ సినిమా ప్రస్తావిస్తుంది. గాంధీజీ పాత్రలో నసీరుద్దీన్ షా నటించగా.. కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ కీలక పాత్రల్లో కనిపించారు. చారిత్రక ఘటనల నేపథ్యంలో గాంధీజీ ఆలోచనలు, శాంతి సందేశాన్ని ఈ చిత్రం విశ్లేషిస్తుంది. ఈ సినిమా ప్రైమ్ వీడియో, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement