సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్‌'.. దిల్‌ రాజు ప్రకటన | Game Changer Movie Release Date Officially Locked | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్‌'.. దిల్‌ రాజు ప్రకటన

Oct 12 2024 9:49 AM | Updated on Oct 12 2024 10:16 AM

Game Changer Movie Release Date Officially Locked

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, దసరా సందర్భంగా  మెగా ఫ్యాన్స్‌లో నిర్మాత దిల్‌రాజు జోష్‌ నింపారు. గేమ్‌ ఛేంజర్‌ విడుదల తేదీని అయన అధికారికంగా ప్రకటిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో కియారా అద్వాని హీరోయిన్‌. ముందుగా ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ, ఇప్పుడు వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ విష‌యంపై చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు స్ప‌ష్ట‌తనిచ్చారు.

'గేమ్ ఛేంజర్’ను ముందుగా ఈ ఏడాది క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశాం. కానీ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్న‌ప్పుడు క్రిస్మ‌స్ కంటే సంక్రాంతి అయితే బావుంటుంద‌ని నాతో పాటు  బాలీవుడ్‌, కోలీవుడ్, క‌ర్ణాట‌క‌ ఓవ‌ర్ సీస్‌లోని ఇత‌ర డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రం భావించాం. ఈ ఆలోచ‌న‌ను నేను చిరంజీవిగారికి, యువీ క్రియేష‌న్స్ సంస్థ‌కు తెలియ‌జేశాం. మూడేళ్లుగా ‘గేమ్ చేంజర్’ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నామ‌ని చెప్పాం. 
 

వాళ్లు రూపొందిస్తోన్న ‘విశ్వంభ‌ర‌’ సినిమా కూడా భారీ బ‌డ్జెట్ సినిమానే. వాళ్లు సంక్రాంతి వ‌స్తున్న‌ట్లు అనౌన్స్ చేశారు. అందువ‌ల్ల సంక్రాంతి డేట్ కావాల‌ని చిరంజీవిగారితో పాటు యువీ క్రియేషన్స్‌ సంస్థను అడిగాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు. దీంతో ‘గేమ్ ఛేంజర్‌’   సంక్రాంతి విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. విశ్వంభ‌ర సినిమా విషయంలో మ‌రో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారు. విశ్వంభ‌ర సినిమా కూడా ఇప్పటికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌తో స‌హా నిర్మాణ పనులన్నీ పూర్తి అయ్యాయి. కానీ,  నా కోసం, మా సినిమా కోసం వాళ్ల  మ‌రో రిలీజ్ డేట్‌కు విశ్వంభర విడుదల చేయ‌టానికి ఒప్పుకున్నారు. అందుకు చిరంజీవిగారికి, యువీ క్రియేష‌న్స్ వంశీ, ప్ర‌మోద్‌, విక్కీకి నా ధ‌న్య‌వాదాలు. 

‘గేమ్ ఛేంజర్’ సినిమాను సంక్రాంతి విడుద‌ల చేస్తున్నాం. ఇటు అభిమానుల‌కు, అటు సినీ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను తీర్చిదిద్దేందుకు క‌ష్ట‌ప‌డుతున్నాం. ఇప్పటికే విడుదలైన రెండు పాట‌లు యూ ట్యూబ్‌లో మారుమోగిపోతున్నాయి. త‌ర్వాత టీజ‌ర్‌తో పాటు మరో మూడు సాంగ్స్‌ రిలీజ్ చేస్తాం. సంక్రాంతిలోపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌ను అందిస్తూ మూవీ భారీ విజ‌యం సాధించేలా ప్లాన్ చేశాం. సంక్రాంతికి క‌లుద్దాం.' అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement