
ఇటీవల ఢిల్లీలో జాతీయ చలన చిత్రం అవార్డుల కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. 2023కు గానూ 71వ జాతీయ సినీ అవార్డ్స్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేశారు. ఈ వేడుక సెప్టెంబర్ 23న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ మెగా ఈవెంట్లో మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. టాలీవుడ్ నుంచి ఎంపికైన సినీ ప్రముఖులు జాతీయ అవార్డులు స్వీకరించారు.
అయితే ఈ జాతీయ అవార్డుల వేడుకల్లో అందరి దృష్టి ఆ చిన్నారి వైపు మళ్లింది. అత్యంత పిన్న వయసులో జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్న చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఘనత సాధించింది. ఉత్తమ బాలనటిగా త్రీషా వివేక్ తోసర్ నిలిచింది. మహారాష్ట్రకు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఉత్తమ బాలనటి అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది.
మరాఠీ చిత్రం 'నాల్ 2'లో నటనకు గానూ ఈ అవార్డ్ దక్కించుకుంది. ఈ సినిమాను తెలుగు వ్యక్తి సుధాకర్ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. నాగరాజ్ ముంజులే నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో త్రీషాకు మూడేళ్లే కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న నాలుగేళ్ల త్రీషా వివేక్ తోసర్ను ట్విటర్ వేదికగా కమల్ హాసన్ అభినందించారు. మీరు నా రికార్డును అధిగమించారని చిన్నారిని కొనియాడారు. నేను ఆరేళ్ల వయసులో మొదటిసారిగా అవార్డు అందుకున్నానని తెలిపారు.
జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్న తర్వాత త్రీషా తోసర్ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రపతి నన్ను అభినందించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఈ చిన్నారితో మోహన్ లాల్, షారూఖ్ ఖాన్ ఫోటోలు దిగారు.