'ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | ENE Repeat Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

'ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Nov 19 2026 6:22 AM | Updated on Nov 19 2026 6:46 AM

ENE Repeat Review And Rating In Telugu

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఈఎన్‌ఈ రిపీట్‌’ (ఈ నగరానికి ఏమైంది రిపీట్‌). 2018లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి ఇది సీక్వెల్‌. అప్పట్లో ఈ సినిమాకు దర్శకత్వం వహించిన తరుణ్‌ భాస్కరే.. మరోసారి అదే స్నేహితుల గ్యాంగ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విశ్వక్‌ సేన్‌, శ్రీనాథ్‌ మాగంటి, అభినవ్‌ గోమఠం, వెంకటేశ్‌ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించారు. శివాత్మిక రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించింది? మొదటి భాగం స్థాయిలో ఆకట్టుకుందా? రివ్యూ లో చూద్దాం.



కథేంటంటే.. 
చిన్నప్పటి నుంచే స్కూల్‌కు ఎగనామం పెట్టి సినిమాలు చూసే నలుగురు స్నేహితులు.. ఎప్పటికైనా సినిమా తీయాలనే కలతో పెరుగుతారు. వారే వివేక్‌ (విశ్వక్‌ సేన్‌), కార్తీక్‌ (శ్రీనాథ్‌ మాగంటి), కౌశిక్‌ (అభినవ్‌ గోమఠం), ఉపేంద్ర (వెంకటేశ్‌ కాకుమాను). సినిమా తీయాలనే ప్రయత్నంలో ఎన్నో కష్టాలు పడతారు. అయితే వీరు తీసిన సినిమా పరాజయం కావడంతో అప్పులపాలవుతారు. 

మరోవైపు వైద్యుడి కుమార్తె కీర్తన (శివాత్మిక రాజశేఖర్‌)కు వైద్య విద్యపై ఆసక్తి ఉండదు. సినిమాటోగ్రఫీ అంటే ఇష్టం. తండ్రికి తెలియకుండా కాలేజీకి వెళ్లకుండా సినిమాటోగ్రఫీ నేర్చుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్‌ దగ్గర సహాయకురాలిగా పనిచేస్తుంది. ఆమెను ప్రేమించిన కార్తీక్‌ తన మనసులోని మాట చెప్పాలనుకుంటాడు. ఇంతలోనే కీర్తనకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని తెలిసి షాక్‌ అవుతాడు. మరి కీర్తనను దక్కించుకోవడానికి కార్తీక్‌ ఏం చేశాడు? అతడి స్నేహితులు ఎలా సాయం చేశారు? సినిమా తీయాలనే వీరి కల ఎలాంటి మలుపులకు కారణమైంది? ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్‌కి కీర్తన వాళ్ల తండ్రి పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు ఏం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
కడుపుబ్బా నవ్వించే సినిమాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ‘ఈ నగరానికి ఏమైంది’ తరహాలోనే ఈ సీక్వెల్‌లోనూ స్నేహం, సినిమా పిచ్చి, జీవితంపై ఆశలు.. వీటికి చక్కటి హాస్యాన్ని జోడించారు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. ముఖ్యంగా నలుగురు స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాలు, వారి సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. పాత్రల స్వభావాలకు తగ్గట్టుగా రాసిన మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 

ఫస్టాఫ్ అంతా మంచి వినోదంతో సాగుతుంది. కథలో అక్కడక్కడ కొత్త పాత్రలను పరిచయం చేస్తూ ఆసక్తి కొనసాగించే ప్రయత్నం చేశారు. సినిమా తీయాలనే తపనతో స్నేహితులు చేసే పనులు, వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలు వినోదాన్ని పంచుతాయి. 

రెండో భాగం కూడా అదే హాస్యంతో మొదలవుతుంది. అయితే కథ ముందుకు సాగుతున్న కొద్దీ కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగుతాయి. కొన్ని చోట్ల కథ పట్టు తప్పిన భావన కలుగుతుంది. కానీ వెంటనే వచ్చే హాస్య సన్నివేశాలు మళ్లీ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాయి. దీంతో ఆ కాస్త నెమ్మదితనం పెద్దగా ఇబ్బంది పెట్టదు. గెస్ట్ అప్పియరెన్స్‌గా వచ్చిన దర్శకులు, వారి సీన్స్ అన్నీ కూడా పండాయి. మొత్తంగా సినిమా ప్రారంభం నుంచి ఎండ్ కార్డు పడేవరకు ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేయడంలో దర్శకుడు మంచి మార్కులు కొట్టేసాడు. 

ఎవరెలా చేశారంటే.. 
వివేక్‌గా విశ్వక్‌ సేన్‌, కార్తీక్‌గా శ్రీనాథ్‌ మాగంటి, కౌశిక్‌గా అభినవ్‌ గోమఠం, ఉపేంద్రగా వెంకటేశ్‌ కాకుమాను తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. నలుగురు స్నేహితుల మధ్య కెమిస్ట్రీ బలంగా పలికించారు. ఈ సినిమాకు వేరే ప్రధాన బలం. వీరి నటనతో మెప్పించారు. శివాత్మిక రాజశేఖర్‌, అనీషా ఆంబ్రోస్‌తో పాటు మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. సంగీతం సన్నివేశాలకు తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ మరోసారి స్నేహితుల మధ్య సరదా సంభాషణలు, హాస్యంతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. 

చివరిగా: స్నేహం, సినిమా కలలు, కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతో ‘ఈఎన్‌ఈ రిపీట్‌’ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా స్నేహితుల గ్యాంగ్‌ చేసే సందడి ఆకట్టుకుంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement