– నయనతార
‘‘ఒక డాక్యుమెంటరీకి కావాల్సినన్ని విషయాలు నా జీవితంలో ఉన్నాయి. సినిమా పరిశ్రమలో ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని ఒక మంచి స్థాయికి చేరుకున్నాను. పైగా నాకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు... నా హార్డ్‌వర్క్‌తో నేను మంచి పొజిషన్‌కి చేరుకున్నాను’’ అని నయనతార పేర్కొన్నారు. ఆమె ఇలా పేర్కొనడానికి కారణం సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విమర్శలే. 2022లో దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార వివాహం జరిగిన విషయం తెలిసిందే.
ఈ పెళ్లి వేడుక, నయనతార వృత్తి, వ్యక్తిగత జీవిత విశేషాలతో ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ పేరుతో ఓటీటీలో డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అయింది. ఈ డాక్యుమెంటరీలో నయనతార నటించిన ‘నానుమ్ రౌడీదాన్’లోని చిన్న క్లిప్‌ని ఉపయోగించినందుకు ఈ చిత్రనిర్మాత ధనుష్ నష్ట పరిహారం కోరుతూ, న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
తాజాగా ఆ వివాదం గురించి కొందరు ప్రస్తావించి, ‘అసలు నయనతారపై డాక్యుమెంటరీ’ అవసరమా? అంటూ విమర్శించారు. ఈ విమర్శలకే ఆమె పై విధంగా స్పందించారు. ‘‘ఒక చిన్న గ్రామానికి చెందిన సాధారణ అమ్మాయిని నేను. అక్కణ్ణుంచి సినిమాల్లోకి వచ్చి, నా కష్టంతో పైకి వచ్చాను. ఈ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఎవరి అండా లేకుండా ఈ స్థాయికి రావడం అంటే చిన్న విషయం కాదు.
నేను మదర్ థెరిస్సాని, స్వాతంత్య్ర సమర యోధురాలినీ, పెద్ద పెద్ద బిరుదులకు అర్హురాలిని కాకపోవచ్చు. అయితే ఏంటి? ఇన్నేళ్లల్లో నేను ఎన్నో విజయాలు సాధించాను. నటిగా, వ్యాపారవేత్తగా... ఏం చేసినా వంద శాతం నిజాయితీతో చేశాను. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నా ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకుండా నిలదొక్కుకున్నాను. నా ఈ సక్సెస్‌ఫుల్ జర్నీని డాక్యుమెంటరీగా తీస్తే తప్పేంటి?’’ అంటూ ఘాటుగా స్పందించారు నయనతార.


