
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. సుమారు 24 బుల్లెట్లు ఆయన ఇంటిలోకి దూసుకెళ్లాయి. ఆ సమయంలో ఎల్విష్ యాదవ్ ఇంట్లో లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, తాజాగా ఆ కాల్పులకు తెగబడిన వారిలో ఒకరిపై పోలీసులు ఎన్‌కౌంటర్ జరిపారు.

గురుగ్రామ్‌లో ఉన్న ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులకు పాల్పడింది ఇషాంత్ అలియాస్ ఇషు గాంధీ (19)గా పోలీసులు గుర్తించారు. ఫరీదాబాద్‌లోని జవహర్ కాలనీకి చెందిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతని సమాచారం అందడంతో అతని కదలికలపై నిఘా పెట్టారు. నీరజ్ ఫరీద్ పురియా ముఠాతో అతనికి సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. ఆ గ్యాంగ్‌లోని కొందరిని కలిసేందుకు ఇషాంత్ వెళ్తుండగా పోలీసులు వెంబడించారు.
దీంతో పోలీసు బృందంపై ఆటోమేటిక్ పిస్టల్‌తో ఇషాంత్ కాల్పులు జరిపాడు. ఆ సమయంలో పోలీసుల టీమ్ కూడా అతని కాలిపై గన్‌తో కాల్చడంతో కిందపడిపోయాడు. గాయాలతో ఉన్న ఇషాంత్‌ను అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఆపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు.