
నటి కీర్తి సురేష్ చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు పలు భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన బ్యూటీ, తమిళంలో మంచి విజయాన్ని సాధించిన తెరి చిత్ర హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అక్కడ బేబీ జాన్‌గా విడుదలైన ఆ చిత్రంతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. అయితే హిందీలో మరో అవకాశం మాత్రం రాలేదు. అదే సమయంలో తన చిరకాల మిత్రుడిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ఏ భాషలోనూ మరో చిత్రంలో నటించలేదు. ఇది ఆమె కావాలని తీసుకున్న బ్రేకా లేక అవకాశాలు రాక అన్నది తెలియదు గానీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.

ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని మరి అందమైన ఫోటోలను తీయించుకొని వాటిని సామాజిక మాధ్యమాలలో విడుదల చేస్తూ అభిమానుల్ని ఆనంద పరుస్తున్నారు. కాగా తాజాగా తమిళంలో కొత్త చిత్రానికి కమిట్ అయినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే సంచలన దర్శకుడు, నటుడు మిష్కిన్‌తో కలిసి ఈ కొత్త చిత్రంలో నటించడానికి కీర్తి సురేష్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే, ఈ చిత్రానికి ఆయన కథ మాత్రమే అందించడమే కాకుండా కీర్తి సురుష్‌తో కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. డిటెక్టివ్, పిశాచి వంటి హిట్ సినిమాలకు దర్శకుడిగా ఆయన పనిచేశారు. రీసెంట్‌గా వచ్చిన డ్రాగన్ సినిమాలో ప్రోఫెసర్‌గా మిస్కిన్ నటన తెలుగువారికి కూడా నచ్చింది.
ఆపై చాలా సినిమాల్లో నటుడిగా మెప్పించారు. కాగా వారిద్దరి కలిసి నటించనున్న క్రేజీ చిత్రానికి దర్శకుడు ఎవరు ? కథ ఎలా ఉంటుంది? ఏ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనుంది, ఇతర నటీనటులు సాంకేతిక వర్గం ఎవరు ? వంటి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉందన్నారు. కాగా ఈ భామ ఇంతకుముందే నటించడానికి అంగీకరించిన రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ రెండు ఉమెన్ సెంట్రిక్ కథాచిత్రాలు అన్నది గమనార్హం.