
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ వర్కర్క్ ఫెడరేషన్ మధ్య జరుగుతున్న వివాదానికి పుల్స్టాప్ పడింది. ఇవాళ జరిగిన చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి యథావిధిగా సినిమా షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. దాదాపు 18 రోజుల తర్వాత టాలీవుడ్లో షూటింగుల సందడి మొదలు కానుంది. లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది.
కాగా.. కొన్ని రోజులుగా తమ వేతనాలు ముప్పై శాతం పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గత 16 రోజులుగా తెలుగు సినిమాల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఇప్పటికే ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిల్మ్ చాంబర్ అటు నిర్మాతలతో, ఇటు కార్మికులతో చర్చలు జరిపింది. కార్మికులు కోరినట్లుగా 30 శాతం జీతాలు పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకోవట్లేదు. కార్మికులు సైతం మొట్టు దిగడం లేదు. పలు దఫాల చర్చల అనంతరం తాము పెట్టిన కండీషన్లకు ఒప్పుకుంటే రూ. 2 వేలలోపు జీతాలు ఉన్న వారికి పర్సంటేజీల ప్రకారం పెంచుతామని నిర్మాతలు ప్రకటించారు. ఇందుకు కార్మికులు విముఖత వ్యక్తం చేశారు. తాజాగా వీటిపై చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి షూటింగ్స్ షురూ కానున్నట్లు తెలుస్తోంది.