
తమిళ స్టార్ హీరో రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్పై చీటింగ్ కేసు ఉన్న విషయం తెలిసిందే. 2015లో తమ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించిన కొచ్చాడియాన్ సినిమా ప్రొడక్షన్ టైంలో ఓ యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి తీసుకున్న ఋణం తిరిగి ఇవ్వకపోవడంతో లతా రజినీకాంత్పై చీటింగ్ కేసు నమోదైంది. ఆమె ష్యూరిటీ సంతకం పెట్టడం వల్లే ఈ చిక్కులు వచ్చాయని సమాచారం. అయితే, ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించింది. కానీ, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదంటూ బెంగళూరు కోర్టులో లత పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం దానిని తిరస్కరించింది.
2014లో విడుదలైన 'కొచ్చాడియాన్' చిత్రానికి సంబంధించిన ఫోర్జరీ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ లత రజనీకాంత్ చేసిన దరఖాస్తును బెంగళూరు కోర్టు కొట్టివేసింది. తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె పేర్కొంది. అయితే, 48వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నిందితులపై విచారణ జరిపేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆమె దరఖాస్తును కొట్టివేశారు.
2015లో, చెన్నైకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో లత నకిలీ పత్రాలను ఉపయోగించి కోర్టును కూడా మోసం చేశారని ఒకరు పిటిషన్ వేశారు. తప్పుడు పత్రాలతో ఆమె మీడియా గ్యాగ్ ఆర్డర్ పొందారని పిటిషన్ దాఖలైంది. ఈ ఆర్డర్‌తో ఆమెపై వచ్చిన పలు మీడియా కథనాలు తొలగించారని అందులో పేర్కొన్నారు. కొచ్చాడియాన్‌తో సంబంధం ఉన్న ఆర్థిక వివాదాలకు సంబంధించిన దాదాపు 70 మీడియా సంస్థలకు చెందిన వార్తలు తొలగించారని తెలిపారు.