
బన్ బటర్ జామ్ మూవీ తమిళంలో ఆల్రెడీ సక్సెస్ అయింది. నేటి యువతకు తగ్గట్టుగా, ట్రెండ్‌ను ఫాలో అవుతూ తీసిన చిత్రంగా ‘బన్ బటర్ జామ్’ మూవీకి మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. ఈ మూవీని తెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ శుక్రవారమే ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది. మరి తెలుగు ఆడియెన్స్‌ను ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో ఓ సారి చూద్దాం.
కథ ఏంటంటే?
లలిత (శరణ్య), ఉమ (దేవ దర్శిని) ప్రస్తుతం ప్రేమ పెళ్లిళ్లు, పెద్దలు కుదర్చిన వివాహాలు ఏవీ కూడా నిలబడటం లేదని తెలుసుకుంటారు. ఇంటర్ చదువుతున్న తమ బిడ్డల్ని ఒకటి చేయాలని లలిత, ఉమలు అనుకుంటారు. లలిత తన కొడుకు చంద్రు ((రాజు జయమోహన్)ని, ఉమ తన కూతురు మధుమిత (ఆద్య ప్రసాద్)ని ఒకే దగ్గర ఉంచేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో లలిత ఇంటి పక్కనే ఓ ఇళ్లు అద్దెకు తీసుకుంటుంది ఉమ. అయితే చంద్రు ఏమో నందిని (భవ్య త్రికా)తో, మధు మిత ఏమో ఆకాష్ (వీజే పప్పు)తో ప్రేమలో ఉంటారు. చివరకు వీరి ప్రేమ కథలు ఒడ్డుకు ఎలా చేరతాయి? చంద్రుకి తన ప్రాణ స్నేహితుడు శ్రీనివాస్ (మైఖేల్)కి దూరం ఎందుకు పెరుగుతుంది? చివరకు హీరో హీరోయిన్ల తల్లులు వేసిన ప్లాన్ బెడిసి కొడుతుందా? సక్సెస్ అవుతుందా? అన్నదే కథ.
ఎలా తీశారంటే?
బన్ బటర్ జామ్ అనే చిత్రం ప్రస్తుతం ఉన్న తరానికి, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉన్నట్టు కనిపిస్తోంది. సమాజంలో ప్రేమ పెళ్లిళ్లు, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్లు అని తేడా లేకుండా అన్నీ విడాకులకే దారి తీస్తున్నాయి. ఇదే పాయింట్ మీద దర్శకుడు కథను రాసుకున్నాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వివాహా బంధం నిలబడాలంటే ఏం చేయాలి? అసలు ప్రేమ ఎలా ఉండాలి? ఎలాంటి ప్రేమను ఇవ్వాలి? ఎలా ప్రేమించాలి? అన్న పాయింట్ల చుట్టూ కథను అల్లుకున్నాడు.
ప్రేమలో ఓడిపోతే జీవితం పోయినట్టు కాదు అనే పాయింట్‌ను చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రేమ, స్నేహం అనే వాటి చుట్టూ కథను చక్కగా అల్లుకున్నాడు. ఇక ఇప్పుడు ఎక్కువగా వినిపించే బెస్టీ అనే ట్రెండ్‌ను కూడా ఇందులో వాడుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కాలేజ్ ఎపిసోడ్స్, ప్రేమ చిగురించే సీన్లు, హీరో హీరోయిన్ల తల్లులు చేసే ఫన్‌తో నడుస్తుంది. ఇక సెకండాఫ్‌కు కథ వెళ్లే సరికి కాస్త ఎమోషనల్‌గా మారుతుంది.
ప్రేమంటే ఏంటి? ప్రేమలో ఓడిపోతే అక్కడే ఆగిపోవాలా? ముందుకు ఎలా సాగాలి? నిజమైన ప్రేమకు అర్థం ఏంటి? అని సెకండాఫ్‌లో చూపిస్తాడు. క్లైమాక్స్ ఊహకందేలానే సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు కథను సాగదీసినట్టుగా అనిపిస్తుంది. గతం గత: అనే పాయింట్‌ను చెప్పేందుకు చాలానే ల్యాగ్ చేశాడనిపిస్తుంది. గతాన్ని వదిలి.. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. వర్తమానాన్ని ఆస్వాధించాలని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది.
సాంకేతికంగా చూసుకుంటే..
బన్ బటర్ జామ్ మూవీకి ఇచ్చిన పాటలు తెలుగు వారికి అంతగా ఎక్కకపోవచ్చనిపిస్తుంది. ఆర్ఆర్ సీన్లకు తగ్గట్టుగా ఉంటుంది. ఇక డైలాగ్స్ కొన్ని చోట్ల గుండెను తాకేలా ఉంటాయి. విజువల్స్ చక్కగా కుదిరాయి. ఎడిటింగ్ బాగుంటుంది. ఓ గ్రాండ్ ఫిల్మ్ చూసినట్టుగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఎవరెలా చేశారంటే..
బన్ బటర్ జామ్ సినిమాలో చంద్రు పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. అమ్మాయిలు అంటేనే భయపడిపోయే చంద్రు పాత్ర అందరినీ మెప్పిస్తుంది. చంద్రు పాత్రలో రాజ్ ఎంతో సహజంగా నటించారు. ఇక నందిని పాత్రకు అయితే నేటి యువతులు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. రీల్స్, ఇన్ స్టా, ఇన్ ఫ్లూయెన్సర్ అంటూ హల్చల్ చేసే ఆ పాత్ర ఎక్కువగా రిలేట్ అవుతుంది. శరణ్య, దేవ దర్శిని పాత్రలు ట్రెండి మామ్స్ అన్నట్టుగా సాగుతాయి. మధుమిత, శివ, శ్రీనివాస్, ఆకాష్ ఇలా అన్ని పాత్రలు బాగానే కుదిరాయి.