
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా కింగ్ స్టన్ మూవీతో నిర్మాతగా కూడా మారిపోయాడు. ఈ చిత్రానికి నిర్మాతగా, హీరోగా, సంగీత దర్శకుడిగా త్రిపాత్రాభినయం చేశారు. ఈ మూవీలో హిరోయిన్‌గా దివ్య భారతి నటించారు. తెలుగు, తమిళం భాషల్లో ఈ మూవీ ఈరోజు రిలీజైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యులో తెలుసుకుందాం.
అసలు కింగ్‌స్టన్ కథేంటంటే..
కింగ్ (జీవీ ప్రకాశ్ కుమార్) తుతువూరు ప్రాంతానికి చెందిన వాడు. తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. ఆ కారణంతో ఆ ఊర్లో ఎవరికీ ఉపాధి ఉండదు. దీంతో ఆంటోని (సబూమన్) గుప్పిట్లోకి వెళ్తాడు కింగ్. అతడి వద్దే పని చేస్తుంటాడు. అక్కడ ఆంటోని చేసే పనులు నచ్చక ఓ టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్‌తో పాటు, అతని ఊరి మొత్తానికి పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే కింగ్‌స్టన్ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
తమిళంలో తెరకెక్కిన కింగ్‌స్టన్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం అంటే కథలో బలం ఉన్నందుకే. ఇలాంటి డిఫరెంట్ కథలకి సినీ ఆడియన్స్ ఆదరిస్తారనే నమ్మకంతో విడుదల చేయటం అభినందనీయం. సముద్ర శాపంతో కొట్టుమిట్టాడే ఓ ఊరి ప్రాంతం.. ఉపాధి లేక అల్లాడిపోతోన్న జనం.. ఆ ఊరి జనం కోసం నిలబడే హీరో... మాస్ ఎలివేషన్స్‌తో వెండి తెరపై హీరో కనిపిస్తే బీసీ సెంటర్లలో విజిల్స్ పడాల్సిందే.
ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఎలివేషన్స్, ఎమోషన్స్ ఉన్నాయి. విలన్ వద్ద హీరో పనిచేస్తూ... అతనికే ధమ్కీ ఇవ్వాలంటే హీరోకి కావాల్సినంత మాస్ ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఈ విషయంలో దర్శకుడు బాగా సెట్ చేశాడు. లాజిక్స్ పక్కన పెట్టి సినిమాను చూస్తే... బాగానే ఎంగేజ్ చేస్తుంది మూవీ. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లో కావడం ప్రేక్షకుల్ని నిరాశ కలిగించినా.... సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ సీన్ కూడా అదిరిపోయింది. డైరెక్టర్ కథను ఆడియన్స్‌కు వివరించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.
ఎవరెలా చేశారంటే..
జీవీ ప్రకాశ్ ఇలాంటి పాత్రలు ఈజీగా చేసేస్తుంటాడు. పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అయిపోతాడు. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ యాక్టింగ్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మాస్ లుక్‌లో అలరించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఫ్యాన్స్‌ను జీవీ మెప్పించాడు. ఇక దివ్య భారతి తన పరిధిలో ఆకట్టుకుంది. ఆంటోని, సాల్మాన్, బోస్, చార్లెస్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికత విషయానికొస్తే విజువల్స్, కెమెరా వర్క్, బీజీఎమ్, వీఎఫ్ఎక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పడవ, సముద్రం, అక్కడ చూపించిన సీన్ విజువల్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment