ప్రియమణి సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ.. ఆడియన్స్‌ను మెప్పించిందా? | Kunchacko Boban Officer on Duty Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

Officer on Duty Movie Review In Telugu: తెలుగులో సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ.. ఎలా ఉందంటే?

Mar 13 2025 6:40 PM | Updated on Mar 13 2025 6:54 PM

Kunchacko Boban Officer on Duty Movie Review In Telugu

టైటిల్: ఆఫీసర్ ఆన్‌ డ్యూటీ(మలయాళ డబ్బింగ్ సినిమా)

నటీనటులు: ప్రియమణి, కుంచకో బోబన్ తదితరులు

డైరెక్టర్:‍ జీతూ అష్రఫ్

నిర్మాతలు: మార్టిన్ ప్రక్కత్, సిబి చవారా, రంజిత్ నాయర్

సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్

తెలుగులో విడుదల: 14 మార్చి 2025

ఇటీవల తెలుగులో మలయాళ చిత్రాలకు ఫుల్ డిమాండ్‌ ఏర్పడింది. మలయాళంలో తెరకెక్కించిన పలు చిత్రాలు తెలుగులోనూ సూపర్‌హిట్‌గా నిలిచాయి. మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు, సూక్ష్మదర్శిని లాంటి సినిమాలు తెలుగులోనూ సత్తాచాటాయి. ముఖ్యంగా ‍క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాలతో పాటు కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ ఆదరిస్తున్నారు. అలా మరో సరికొత్త క్రైమ్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మలయాళంలో ఫిబ్రవరిలో విడుదలైన ఆఫీసర్ ఆన్‌ డ్యూటీని తెలుగులోనూ రిలీజ్‌ చేశారు. మలయాళ స్టార్ కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

అసలు కథేంటంటే..

సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాలకు ప్రత్యేకమైన ఆడియన్స్ ఉంటారు. అందుకే ఈ జోనర్ సినిమాలకు ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. జీతూ అష్రఫ్‌ తన డెబ్యూ కథగా అలాంటి జోనర్‌నే ఎంచుకున్నారు. పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకునే సీన్‌తో కథ మొదలవుతుంది. ఆ తర్వాత బస్సులో చైన్ స్నాచింగ్‌, ఫేక్ గోల్డ్‌ లాంటి కేసుల చుట్టూ తిరుగుతుంది. అయితే ఇలాంటి కేసులను అవలీలగా ఛేదించే సీఐ హరిశంకర్‌(కుంచకో బోబన్) ఫేక్ గోల్డ్ కేసు ఎదురవుతుంది. ఆ కేసును సీరియస్‌గా తీసుకున్న హరిశంకర్‌ దర్యాప్తు ప్రారంభిస్తారు. ఆ సమయంలో సీఐ హరిశంకర్‌కు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అంతే కాకుండా ఈ ఫేక్ గోల్డ్‌ కేసు కాస్తా ఓ అమ్మాయి ఆత్మహత్యకు దారితీస్తుంది. అసలు ఈ కేసుతో ఆ అమ్మాయికి గల సంబంధం ఏంటి? ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్‌ చేసుకుంది? ఆ అమ్మాయి సూసైడ్‌కు హరిశంకరే కారణమా? దీని వెనక ఏదైనా మాఫియా ఉందా? ఇదేక్రమంలో హరిశంకర్‌కు భార్య ప్రియమణి(గీత)తో తీవ్రమైన గొడవ జరుగుతుంది. అన్యోన్యంగా ఉండే భార్య, భర్తల మధ్య గొడవ ఎందుకు జరిగింది? అసలు వారిద్దరు ఎందుకు విడిపోవాలనుకున్నారు? వీరి ముద్దుల కూతురు ఎందుకు సూసైడ్ చేసుకుంది? అనే విషయాలు తెలియాలంటే ఆఫీసర్ ఆన్ డ్యూటీ చూడాల్సిందే.


ఎలా ఉందంటే..

సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాలు అనగానే దాదాపుగా ప్రేక్షకుల ఊహకందేలా ఉంటాయి. మర్డర్ మిస్టరీని ఛేదించడం లాంటివీ కథలు రోటీన్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇలాంటి జోనర్‌లో పోలీసులు, నిందితులను పట్టుకోవడం, వారికి శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం చేయడం చుట్టే కథ తిరుగుతుంది.  కానీ ఆఫీసర్ ఆన్‌ డ్యూటీలో పోలీసు అధికారులే బాధితులు కావడమనేది కొత్త పాయింట్‌ను డైరెక్టర్‌ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో వరుస కేసులు, దర్యాప్తు సమయంలో వచ్చే ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ను ఆసక్తిని క్రియేట్ చేశాడు డైరెక్టర్. అసలు ఒక కేసు దర్యాప్తు చేయడానికి వెళ్తే.. ఆ కేసు మరో కేసుకు లింక్ కావడంతో మరింత ఇంట్రెస్టింగ్‌ అనిపిస్తుంది. నిందితుల కోసం హరిశంకర్‌ వేసే స్కెచ్‌, అతనికి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఎదురయ్యే సమస్యలు కాస్తా రోటీన్‌గానే అనిపిస్తాయి. ఈ కేసు కీలకదశలో ఉండగానే ఊహించని ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

 

సెకండాఫ్‌లో మరింత ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను సీట్‌కు అతుక్కునేలా చేశాడు డైరెక్టర్‌ అష్రఫ్. వరుస ట్విస్ట్‌లతో ప్రేక్షకుల్లో సస్పెన్స్ క్రియేట్ చేశాడు. నిందితులను పట్టుకునే క్రమంలో వచ్చే సీన్స్, ఫైట్స్‌తో ఆడియన్స్‌కు వయొలెన్స్‌ను పరిచయం చేశాడు మన దర్శకుడు. సెకండాఫ్ మొత్తం వన్‌ మ్యాన్‌ షోగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఓ సిన్సియర్‌ పోలీసు అధికారి కేసు డీల్ చేస్తే ఎలా ఉంటుందనేది కోణం కూడా దర్శకుడు తెరపై ఆవిష్కరించాడు. పోలీసులు నిందితుల కోసం వేసే స్కెచ్‌, దర్యాప్తు సీన్స్ రోటీన్‌గా ఉన్నప్పటికీ.. ఈ జోనర్‌లో కథలో కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కథను సస్పెన్స్‌గా తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కొన్ని చోట్ల రోటీన్‌గా అనిపించినా.. ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్‌లతో కథను ఆసక్తిగా తీసుకెళ్లాడు. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు ఎండింగ్‌లో కూడా అంతే ట్విస్ట్‌ ఇచ్చాడు.  క్లైమాక్స్‌ సీన్‌తో ఆడియన్స్‌కు కాసేపు ఉత్కంఠకు గురిచేశాడు. ఓవరాల్‌గా కొత్త డైరెక్టర్ అయినా తాను అనుకున్న పాయింట్‌ను తెరపై ఆవిష్కరిచండంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాలు ఇష్టపడే వారికి ఆఫీసర్ ఆన్ డ్యూటీ సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఎవరెలా చేశారంటే..

మలయాళ స్టార్ కుంచన్‌ బోబన్‌ పోలీసు అధికారిగా తన అగ్రెసివ్‌ యాక్టింగ్‌తో మెప్పించాడు. ముఖ్యంగా తనదైన భావోద్వేగాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ప్రియమణి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికీ.. తన రోల్‌కు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల పరిధిలో ఆడియన్స్‌ను మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే..  విజువల్స్ పరంగా ఫర్వాలేదు.  సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా జేక్స్ బిజోయ్ బీజీఎం ఈ సినిమాకు ప్లస్. ఎడిటింగ్‌లో ఇంకాస్తా ఫోకస్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. 

 

- మధుసూదన్, సాక్షి వెబ్‌డెస్క్

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement