
టైటిల్ : ఓజీ
నటీనటులు: పవన్ కల్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సుదేవ్ నాయర్, రాహుల్ రవీంద్రన్ తదిరులు
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు : డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి
దర్శకత్వం: సుజీత్
సంగీతం: తమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
ఎడిటర్ : నవీన్ నూలి
విడుదల తేది: సెప్టెంబర్ 25, 2025
‘హరిహర వీరమల్లు’లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ నుంచి వచ్చిన మూవీ ‘ఓజీ’(OG Review). మూడేళ్ల కిత్రం శ్రీకారం చుట్టుకున్న ఈ చిత్రం పవన్ కారణంగా ఆలస్యమే..ఎట్టకేలకు కొన్ని నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు(సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? వరుస డిజాస్టర్స్‌ను చవిచూసిన పవన్‌కు ‘ఓజీ’తో అయినా హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1970-90ల మధ్యకాలంలో జరుగుతుంది. జపాన్‌లో జరిగిన ఓ దాడి నుంచి బయటపడ్డ ఓజాస్ గంభీర(పవన్ కల్యాణ్)..ఇండియాకు వెళ్లే ఓడ ఎక్కుతాడు. అక్కడ సత్యాలాల్ అలియాస్ సత్యదాదా(ప్రకాశ్‌రాజ్)పై అటాక్ జరిగితే..రక్షిస్తాడు. దీంతో ఓజీని సత్యాదాదా బొంబాయి తీసుకొస్తాడు. అక్కడ ఓ పోర్ట్‌ని నిర్మించి.. సత్యదాదా డాన్‌గా ఎదుగుతాడు. అతనికి ఓజాస్ గంభీర తోడుగా నిలుస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంగా గంభీర బొంబాయి వదిలి వెళ్తాడు. డాక్టర్ కన్మణిని పెళ్లి చేసుకొని నాసిక్‌లో కొత్త జీవితం ప్రారంభిస్తారు(OG Movie Review).
ఓజీ బొంబాయి వీడిన తర్వాత సత్యదాదా స్నేహితుడు మిరాజ్ కర్(తేజ్ సప్రూ)తో పాటు తన కొడుకులు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) నగరాన్ని తమ గుప్పిట్లో పెటుకునేందుకు ప్రయత్నిస్తారు. సత్యదాదా పోర్ట్‌లో ఉన్న తన కంటేనర్‌ని స్వాధీనం చేసుకునేందుకు ఇస్తాంబుల్‌లో ఉన్న ఓమీ.. ముంబైకి వస్తాడు. సత్యదాదా పోర్ట్‌ని స్వాధీనం చేసుకొని..తన మనుషులను అతిదారుణంగా చంపేస్తాడు. అప్పటికే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న సత్యదాదాకు మళ్లీ ఓజీ అవసరం పడుతుంది. మరి ఓజీ తిరిగి బొంబాయి వచ్చాడా? అసలు ఓజీ బొంబాయిని ఎందుకు వదలాల్సి వచ్చింది? తండ్రిలా భావించే సత్యదాదాకు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు? ఓమీ కంటేనర్‌లో ఉన్న విలువలైన వస్తుంలేంటి? సత్యాదాదా ఇద్దరు కొడుకులు ఎలా చనిపోయారు? దాదా మనవడు అర్జున్(అర్జున్ దాస్) ఓజీని ఎందుకు చంపాలనుకున్నాడు? ఓజీ ప్లాష్‌బ్యాక్ ఏంటి? ఈ కథలో శ్రీయారెడ్డి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
గ్యాంగ్‌స్టర్ కథలు..అందులోనూ ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఓజీ(They Call Him OG Review) కూడా అలాంటి రొటీన్ అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ స్టోరీనే. అయినప్పటికీ ప్రారంభ సన్నివేశాలు గంభీరంగానే ఉన్నాయి. కానీ కాసేపటికే కథనంలో ఎక్కడా బిగువు లేదన్నది తెలుస్తూ ఉంటుంది. కథ ముందుకు సాగేకొద్ది.. పవన్ నటించిన పంజా సినిమాతో పాటు చాలా సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. వాటిని మరిపించేందుకు ఏవైనా ట్విస్టులు అయినా ఉంటాయా అంటే అదీ ఉండదు. కథ ప్రారంభంలోనే క్లైమాక్స్ సీన్ ఊహించొచ్చు.
కథ-కథనం విషయాన్ని పక్కన పెట్టి.. ఎలివేషన్‌పైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రారంభంలో ఆ ఎలివేషన్ ఆకట్టుకున్నా.. ప్రతిసారి అలాంటి సీన్లే రిపీట్ అవ్వడంతో ఒకానొక దశలో చిరాకు అనిపిస్తుంది. అయితే ఫ్యాన్స్‌కి మాత్రం అవి కిక్ ఇస్తాయి. యాక్షన్ సీన్లు కూడా పవన్ గతంలోనే చేసిన సినిమాలనే గుర్తు తెస్తాయి. ఇక లాజిక్‌ల గురించి మాత్రం అస్సలు ఆలోచించొద్దు. కత్తితో గన్ నుంచి వదిలిన బుల్లెట్లను ఆపడం... రక్తంతో కాలి బూటుకి అంటుకున్న అగ్నిని చల్లార్చడం..ఇలా ‘బాలయ్య’ ను మించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి.
జపాన్ లో కథను ప్రారంభించడంతో ఇదేదో కొత్త కథలా ఉండే అనుకుంటాం. కానీ ఆ మరుక్షణమే కొత్తదనం ఆశించడం తప్పనే విషయం తెలిసిపోతుంది. సత్యదాదాకు ఓజీ పరిచయం అవ్వడం.. ముంబై వదిలి అజ్ఞాతంలోకి వెళ్లడం.. కన్మణితో ప్రేమాయణం ఒకవైపు.. ఓమీ అరచకాలు.. దాదా పోర్ట్‌పై దాడి.. ఈ విషయం తెలిసి ఓజీ ముంబై రావడం..ఫస్టాప్ అంతా ఇలా రొటీన్‌గానే సాగినా.. క్యారెక్టర్లకు ఇచ్చిన ఎలివేషన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్ ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తుంది. ఇక సెకండాఫ్ కథనం మొత్తం ఊహకందేలా సాగుతుంది. ఫ్యామిలీ సన్నివేశాల్లో ఎమోషన్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది.
ఎలివేషన్ మీద పెట్టిన శ్రద్ధలో సగమైనా ఎమోషనల్ సీన్లపై పెడితే బాగుండేది. రక్తపాతం జరుగుతున్నా.. కీలక పాత్రలు జరుగుతున్నా..ఎక్కడా జాలీ, బాధ కలగదు. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. పార్ట్ 2 కోసమే అన్నట్లుగా.. క్లైమాక్స్‌లో ఓజీ ప్లాష్‌బ్యాక్‌కి మరో ఎలివేషన్ ఇచ్చారు. ‘అవసరం’ అయినప్పడు మళ్లీ వస్తా’ అని హీరోతో ఓ డైలాగ్ చెప్పింది.. రెండో భాగం కూడా ఉందని ప్రకటించారు.
ఎవరెలా చేశారంటే..
పవన్ నటన పరంగా చేయడానికేమి లేదు. వింటేజ్ లుక్ తప్ప ఆయన నుంచి కొత్తగా ఏమి ఆశించొద్దు. ఆయనకు సంబంధించిన చాలా సీన్లు డూప్‌తో తీశారు. అది తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. యాక్షన్ సీన్లే కాదు ఎలివేషన్ సన్నివేశాల్లోనూ డూప్‌నే వాడినట్లు ఉన్నారు. కొన్ని చోట్ల పవన్‌కి కళ్లజోడు పెట్టి మ్యానేజ్ చేస్తే.. మరికొన్ని చోల్ల తలను కిందికి దింపి కవర్ చేశారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా పవన్‌ని తెరపై చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ఇక విలన్ ఓమీగా ఇమ్రాన్ హష్మీ బాగానే నటించాడు. ఇక కన్మణి పాత్రకి ప్రియాంక మోహన్ న్యాయం చేసింది. తెరపై కనిపించేది కాసేపే అయినా ఉన్నంతలో బాగానే చేసింది. సత్యదాదాగా ప్రకాశ్ రాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గీతగా శ్రియారెడ్డి మరోసారి డిఫరెంట్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఆమె పాత్రకు ఒకటి రెండు బలమైన సన్నివేశాలు పడ్డాయి. తేజ్ సప్రూ, సుదేశ్ నాయర్, హరీశ్ ఉత్తమ్, రాహుల్ రవీంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రధానబలం. రొటీన్ సన్నివేశాలకు కూడా తనదైన బీజీఎంతో హైప్ తీసుకొచ్చాడు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్లు బాగున్నాయి. వీఎఫెక్స్ తేలిపోయింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)