‘మిరాయ్‌’ మూవీ రివ్యూ | Mirai Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Mirai Review: ‘మిరాయ్‌’ మూవీ రివ్యూ

Sep 12 2025 12:24 PM | Updated on Sep 12 2025 1:57 PM

Mirai Movie Review And Rating In Telugu

హను-మాన్‌ తర్వాత తేజ సజ్జా గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ ఒక్క సినిమాతోనే ఈ కుర్ర హీరో పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. అయితే ఆ స్టార్‌డమ్‌ని నిలబెట్టుకోవాలంటే.. తేజకి ఇంకో హిట్‌ కచ్చితంగా కావాలి. అందుకే వెంటనే సినిమా చేయకుండా.. కాస్త సమయం తీసుకొని డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘మిరాయ్‌’.  కార్తీక్‌  ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై తొలి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ఆ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘మిరాయ్‌’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్‌ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తేజా సజ్జ ఖాతాలో హిట్‌ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
ఈ కథ అశోకుడి పాలన(క్రీ.పూ.232)లో ప్రారంభమై.. ప్రస్తుత కాలంలో సాగుతుంది. కళింగ యుద్ధం తర్వాత సామ్రాట్‌ ఆశోకుడు పశ్చాత్తాపానికి లోనై.. తనలో దాగి ఉన్న దివ్య శక్తిని 9 గ్రంథాలలోకి ఇముడింపజేస్తాడు. ఒక్కో గ్రంథంలో ఒక్కో శక్తి ఉంటుంది. వాటికి తరతరాలుగా 9 మంది యోధులు రక్షకుల ఉంటారు. మహావీర్‌ లామా(మంచు మనోజ్‌) వాటిని చేజిక్కుంచుకుని దివ్య శక్తిలను పొంది.. ప్రపంచాన్ని శాసించాలని చూస్తాడు. తనకున్న తాంత్రిక శక్తుల బలంతో 8 గ్రంథాలను సొంతం చేసుకుంటాడు. తొమ్మిదో గ్రంథం అంభిక(శ్రియా శరన్‌) రక్షణలో ఉంటుంది. 

మహావీర్‌ కుట్రను ముందే పసిగట్టిన అంభిక.. తొమ్మిదో గ్రంథం రక్షణ కోసం తన కొడుకు వేద(తేజ సజ్జా)ను తయారు చేస్తుంది. అనాథగా పెరిగిన వేదకు విభా(రితిక నాయక్‌) దిశానిర్దేశం చేస్తుంది. మహావీర్‌ని ఆడ్డుకునే శక్తి ‘మిరాయ్‌’ ఆయుధంలో ఉందని వేదకు తెలిసేలా చేస్తుంది. మరి మిరాయ్‌ ఆయుధం కోసం వేద ఏం చేశాడు? ఆ ఆయుధాన్ని కనిపెట్టే క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? హిమాలయాల్లో ఉన్న ఆగస్త్య(జయరాం) అతనికి ఎలాంటి సహాయం చేశాడు. చివరకు ఆ తొమ్మిదో గ్రంథం మహావీర్‌ చేతికి వెళ్లిందా లేదా?  మహావీర్‌ నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో సినిమా చూడాల్సిందే. 



ఎలా ఉందంటే.. 
పురాణాలు, ఇతీహాసాల్లోని కథలను తీసుకొని, దానికి కాస్త ఫిక్షన్‌ జోడించి సినిమా చేయడం..ఈ మధ్య టాలీవుడ్‌లోనూ ట్రెండింగ్‌గా మారింది. ఆ  సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కూడా. ఆ కోవలోకి చెందిన చిత్రమే ‘మిరాయ్‌’.  

అశోకుని దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉన్నాయనే మిత్‌ని తీసుకొని.. ఒకవేళ ఆ గ్రంథాల కోసం దుష్టులు ప్రయత్నిస్తే.. మన ఇతిహాసాల ఆధారంగా ఎలా కాపాడవచ్చు అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు.  కథగా చూస్తే..  ఇది మరీ అంత కొత్తదేమి కాదు. హను-మాన్‌, కార్తీకేయ 2  తో పాటు హాలీవుడ్‌లోనూ ఈ తరహా సినిమాలు వచ్చాయి. అయితే దర్శకుడు ఆ కథకు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌, విజువల్‌ ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉన్నాయి.  

కార్తీకేయ 2లో కృష్ణుడి కంకణం కోసం హీరో బయలుదేరితే.. మిరాయ్‌లో శ్రీరాముడి కోదండం కోసం వెతుకుతాడు.  ఈ నేపథ్యంలో వచ్చే సన్నిశాలు స్క్రీన్‌పై చూస్తుంటే గూస్‌బంప్స్‌ గ్యారెంటీ. ముఖ్యంగా ఇంటర్వెల్‌ ముందు వచ్చే సంపాతి పక్షి ఎపిసోడ్‌ నెక్ట్స్‌ లెవల్‌.  అలాగే సెకండాఫ్‌లో కూడా ఒకటి, రెండు సీన్లు అదిరిపోయాయి.  రాముడి ఎపిసోడ్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే... సెకండాఫ్‌ కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది.  అయితే ట్రైన్‌ ఎపిసోడ్‌,  శ్రీరాముడి ఎపిసోడ్‌ .. ఆ సాగదీతను మరిపిస్తుంది. క్లైమాక్స్‌ కూడా బాగున్నా.. వావ్‌ ఫ్యాక్టర్‌ మిస్‌ అయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా ‘మిరాయ్‌’ మాత్రం థియేటర్స్‌లో చూడాల్సిన విజువల్‌ వండర్‌. 

ఎవరెలా చేశారంటే.. 
వేద పాత్రలో తేజ సజ్జా ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్లలో అదరగొట్టేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. ఇదే తరహాలో డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ పోతే మాత్రం..తేజ రేంజ్‌ ఊహించని స్థాయికి వెళ్తుంది. ఇక మంచు మనోజ్‌ విలనిజం అద్భుతంగా పండించాడు.  తేజ సజ్జ కంటే మనోజ్‌ పాత్రకే ఎక్కువ ఎలివేషన్స్‌ ఉన్నాయి.  మహావీర్‌ పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడు.  శ్రీయకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించింది. 

వేద తల్లి అంభిక పాత్రకి ఆమె పూర్తి న్యాయం చేసింది.  ఆమె తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది.  ఆగస్త్య పాత్రలో జయరాం చక్కగా నటించాడు. రితికా నాయక్‌, జగపతి బాబు, వెంకటేశ్‌ మహా, తిరుమల కిశోర్‌, గెటప్‌ శ్రీనుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం గౌర హరి నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ముఖ్యంగా సంపాతి పక్షి ఎపిసోడ్‌, రాముడి ఎపిసోడ్‌కి ఇచ్చిన బీజీఎం గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి.  దర్శకుడిగానే కాకుంగా సినిమాటోగ్రాఫర్‌గాను కార్తీక్‌ వందశాతం సక్సెస్‌ అయ్యాడు. ప్రతీ సీన్‌ తెరపై చాలా రిచ్‌గా ఉంది. ఇక వీఎఫెక్స్‌ పని తీరు గురించి ముఖ్యంగా చెప్పుకొవాలి. వందల కోట్ల పెట్టి తీసిన సినిమాల్లోనూ గ్రాఫిక్స్‌  పేలవంగా ఉంటుంది. కానీ రూ. 60 కోట్ల బడ్జెట్‌లో ఈ స్థాయి ఔట్‌ పుల్‌ తీసుకురావడం నిజంగా మెచ్చుకోవాల్సిందే.  ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:

What's your opinion?

‘మిరాయ్‌’ మూవీ ఎలా ఉంది?

Choices
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement