‘1970లలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనప్పుడు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోను స్థాపించడం ఒక అద్భుతం’ అని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నాగార్జున ఆహ్వానం మేరకు శనివారం ఆయన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను సందర్శించారు. ఈ సందర్భంగా దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుని గుర్తుచేసుకున్నారు.
ఏఎన్నార్ అన్నపూర్ణ స్టూడియోని ప్రారంభించిన నాటి నుంచే సాంస్కృతిక, సినిమాటిక్ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటిగా ఎదిగింది. అన్నపూర్ణ కళాశాల విద్యార్థులు రూపొందించిన ‘రోల్ నం.52’ను నేను చూశాను. ఎంతో అర్థవంతమైన కథతో రూపొందిన ఆ సినిమా అందరి హృదయాలను హత్తుకుంది’’ అంటూ ప్రశంసలు కురిపించారు.

ఇక తెలంగాణ ఆర్థిక వృద్ధికి ప్రభుత్వ దార్శనికతను ఆయన హైలైట్ చేస్తూ, “2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భవిష్యత్తును నిర్మించడంలో చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి సీనియర్ సినీ దిగ్గజాల మద్దతును మేము ఆశిస్తున్నాము” అని అన్నారు.
అన్నపూర్ణ కళాశాల నుండి వెలువడుతున్న అసాధారణ ప్రతిభ గురించి అక్కినేని నాగార్జున స్వయంగా మాట్లాడారని, అది తన సందర్శనకు ప్రేరణనిచ్చిందని ఆయన అన్నారు. ‘సినిమా రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే మేటిగా అభివృద్ధి చేయడంలో తనతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ మద్దతు ఎప్పటికీ ఉంటుంది’ అని నాగార్జున అన్నారు.


