
టైటిల్: డ్యూడ్
నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, శరత్ కుమార్, రోహిణి,హృదు హరూన్,నేహా శెట్టి
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
రచన, దర్శకత్వం: కీర్తిశ్వరన్
సంగీతం: సాయి అభ్యంకర్
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి
ఎడిటర్: బరత్ విక్రమన్
విడుదల తేది: అక్టోబర్ 17, 2025
లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాలతో తెలుగులో కూడా మంచి విజయాలు అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్.. తాజాగా ఆయన నటించిన సినిమా డ్యూడ్ విడుదలైంది.. హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి యూత్‌న్ టార్గెట్ చేస్తూనే ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటించగా.. శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. డ్యూడ్ సినిమాతో మలయాళ నటుడు హృదు హరూన్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించారు. గతంలో ఆయన సుధా కొంగర వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
కథ ఏంటి..?
ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్‌గా కథలోకి వెళ్లిపోతాడు దర్శకుడు. రాష్ట్రంలో ఎంతో పేరు పొందిన మంత్రిగా ఆదికేశవులు (శరత్ కుమార్) ఉంటాడు. తన రాజకీయ భవిష్యత్ కోసం ఏమైనా చేయగలిగే వ్యక్తి. తన కులానికి చెందిన వాడినే అల్లుడిగా చేసుకోవాలని కోరుకుంటాడు. అలాంటి వ్యక్తికి కుమార్తె కుందన (మమితా బైజు) ఉంటుంది. ఆమెకు మేనత్త కుమారుడు గగన్ (ప్రదీప్ రంగనాథన్).. ఇద్దరి మధ్య చిన్నతనం నుంచే మంచి బాండింగ్ ఉంటుంది. ఈ క్రమంలోనే గగన్‌ను కుందన ప్రేమిస్తుంది. కానీ, అతను మాత్రం మరో అమ్మాయిని ఇష్టపడుతాడు. వారిద్దరి మధ్య బ్రేకప్ కాగానే కుందన తన ప్రేమ విషయాన్ని గగన్‌తో పంచుకుంటుంది. అయితే, గగన్ ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. దీంతో కుంగిపోయిన కుందన ఒంటరిగా ఉండేందుకు బెంగళూరు వెళ్లిపోతుంది.
ఆమె దూరమే గగన్‌కు తన ప్రేమను అర్థమయ్యేలా చేస్తుంది. అయితే, తన ప్రేమ విషయాన్ని మొదట తన మామ (శరత్ కుమార్)తో చెప్తాడు. సంతోషంగా పెళ్లికి ఒప్పుకొని ఏర్పాట్లు కూడా చేస్తాడు. బెంగళూరు నుంచి తిరిగొచ్చిన కుందన తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది. అలా కుందన సడెన్‌గా నిర్ణయం మార్చుకోవడానికి ఉన్న కారణం ఏంటి.. గగన్- కుందన పెళ్లికి ఉన్న చిక్కులు ఎవరి వల్ల వచ్చాయి.. కుందన ఎలాంటి కారణాలు చెబుతుంది... ప్రియురాలి కోసం గగన్ చేసిన త్యాగం ఏంటి.. గగన్ తల్లి (రోహిణి), కుందన తండ్రి (శరత్ కుమార్) అన్నాచెల్లెలు.. అయినప్పటికీ ఎందుకు మాట్లాడుకోరు.. ఫైనల్‌గా కుందనతో గగన్ పెళ్లి జరిగిందా లేదా అనేది తెలియాలంటే డ్యూడ్ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..?
డ్యూడ్ సినిమా ప్రమోషన్‌లో ఈ కథకు స్ఫూర్తి అల్లు అర్జున్ నటించిన ఆర్య-2 చిత్రమేనని దర్శకుడు చెప్పారు. ఆయన ఈ మాట ఎందుకు చెప్పారనేది చిత్రం చూసిన తర్వాత తెలుస్తోంది. ఆర్య కాన్సెప్ట్‌నే డ్యూడ్‌లో చూపించారు. లవ్ ఫెయిల్ అయితే దేవదాస్‌లు కానక్కర్లేదు.. ప్రేయసి కోసం ప్రేమికుడిగా ఏం చేయవచ్చో డ్యూడ్ చెప్తాడు. కథలో పెద్దగా కొత్తదనం ఉండదు. కానీ, ఫుల్ ఫన్‌తో ఈ చిత్రం ఉంటుంది. కథ చాలా రొటీన్‌గా ఉన్నప్పటికీ తెరపై దర్శకుడు చూపించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ విషయంలో కీర్తిశ్వరన్ విజయం సాధించాడు. కాన్సెప్ట్ అంతా పాతదే అయినప్పటికీ నేటి యూత్ కోసం కొత్తగా చూపించాడు.
నిజమైన ప్రేమకు ఎమోషన్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ పాయింట్‌నే డ్యూడ్‌లో చూపించారు. డ్యూడ్ మూవీ చూస్తున్నంత సేపు అక్కడక్కడ ఆర్య-2 గుర్తకు వస్తుంది. అయితే, ఇక్కడ ఆ సీన్లు చాలా ఫ్రెష్‌గానే ఉంటాయి. ఈ మూవీలో డైలాగ్స్ చాలా చోట్ల యూత్‌తో విజిల్స్ వేపించేలా ఉంటాయి. అయితే. క్లైమాక్స్‌లో మినహా ఎక్కడా కూడా భావోద్వేగంతో కూడిన సీన్స్ కనిపించవ్.. కానీ, కుందన ప్రేమను గగన్ తిరస్కరించిన సమయంలో వచ్చే సీన్ ప్రతి ప్రేమికుడిని గుచ్చేస్తుంది. సినిమా ఎండింగ్ కూడా ప్రేక్షకుడిని సంతృప్తి పరిచేలా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..?
డ్యూడ్‌కు ప్రధాన బలం ప్రదీప్ రంగనాథ్.. గత సినిమాల మాదరే ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు తన ఎక్స్‌ప్రెషన్స్‌తో దుమ్మురేపాడు. ఆ తర్వాత శరత్ కుమార్ అద్భుతంగా నటించారు. ఇందులో ఆయన కాస్త ఫన్నీగా కనిపించడమే కాకుండా అవసరమైన చోట సీరియస్‌గా కనిపించి తన పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. అయితే, మమితా బైజు వారిద్దరితో పోటీ పడుతూ నటించింది. నటన పరంగా మంచి స్కోప్ ఉన్న పాత్రనే ఆమెకు దక్కిందని చెప్పవచ్చు.
మలయాళ నటుడు హృదు హరూన్, రోహిణి తమ పరిదిమేరకు నటించారు. తమిళ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసి కీర్తిశ్వరన్.. డ్యూడ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే మెప్పించాడని చెప్పవచ్చు. డ్యూడ్ చిత్రానికి మరో ప్రధాన బలం సంగీతం. సాయి అభ్యంకర్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకుడిలో జోష్ నింపుతుంది. పైనల్‌గా పుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు. యూత్‌న్ మాత్రం నిరాశపరచదని చెప్పవచ్చు.