ఓటీటీ సినిమాలు అనగానే అయితే రొమాంటిక్ లేదా థ్రిల్లర్స్ ఉంటాయిలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు డిఫరెంట్ స్టోరీలతో తీసిన మూవీస్ కూడా వస్తుంటాయి. అలా తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన తమిళ బోల్డ్ మూవీ 'హాట్‌స్పాట్ 2 మచ్'. 2024లో వచ్చిన తొలి పార్ట్ అందరికీ షాక్ ఇవ్వగా.. ఇప్పుడొచ్చిన సీక్వెల్ కూడా అదే రేంజులో ఆశ్చర్యపరిచింది. విఘ్నేశ్ కార్తిక్ దర్శకుడు కాగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్.. లెస్బియన్ పాత్ర చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ సినిమా.. 'చథా పచ్చ' తెలుగు రివ్యూ)
కథేంటి?
తొలి భాగంలో ఓ నిర్మాతకు స్టోరీ చెప్పడానికి వచ్చిన మహమ్మద్ షరీఫ్(విఘ్నేశ్ రాజా).. స్టోరీలన్నీ చెప్పి చివరకు నిర్మాత కుమార్తెనే(బ్రిగిడ సాగా) పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే శిల్ప(ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి ఇదే నిర్మాత దగ్గరకు స్టోరీ నెరేషన్ కోసం వస్తుంది. ఓ మూడు కథలు చెబుతుంది. వీటిలో ఒకటి హీరోలని పిచ్చిగా అభిమానించే ఓ ఇద్దరు కుర్రాళ్ల గురించి కాగా.. రెండోది డ్రస్సింగ్ సెన్స్ గురించి.. మూడోది టైమ్ ట్రావెల్ ప్రేమకథ. ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉంటాయి. అసలు శిల్ప, ఈ నిర్మాతకే స్టోరీ చెప్పడం వెనక ఓ ఉద్దేశం ఉంటుంది. ఇంతకీ అదేంటి? శిల్ప ఎవరు? షరీఫ్‌తో ఈమెకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
సినిమా అంటే ఇలానే ఉండాలి. ఇలానే తీయాలి అని కొన్ని లెక్కలు ఉంటాయి. వాటిని బ్రేక్ చేస్తూ అప్పుడప్పుడు కొందరు దర్శకులు ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నమే 'హాట్‌స్పాట్'. 2024లో వచ్చిన ఈ సినిమాలో చిత్రవిచిత్రమైన అంశాల్ని చూపించగా.. ఈసారి సీక్వెల్‌లో మాత్రం సమాజంలోని హాట్ టాపిక్ లాంటి మూడు అంశాలని తీసుకుని వాటిని కన్విన్సింగ్‌గా చెప్పగలిగాడు. మెప్పించాడు కూడా.
తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలని అభిమానించడం అనేది చాలా సాధారణమైన విషయం. అలా విపరీతమైన ఫ్యానిజం చూపించే ఇద్దరు కుర్రాళ్లకు.. ఓ అజ్ఞాత వ్యక్తి ఎలాంటి గుణపాఠం చెప్పాడు. వాళ్లకు ఎలా కళ్లు తెరిపించాడు అనేది తొలి స్టోరీగా చూపించారు. ఇందులో చెప్పిన పాయింట్స్ గానీ, చూపించిన అంశాలు గానీ పచ్చి నిజాలే. యువత తమ సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా హీరోలకు ఎలా బానిసత్వం చేస్తున్నారు? వాళ్ల సినిమాల రిలీజ్ టైంలో ఎలా కొట్టుకుచస్తున్నారనేది చూపించారు. చివరలో ఇచ్చిన ట్విస్ట్ అయితే ఆలోచన రేకెత్తించడంతో పాటు ఇలా ఉన్నారేంట్రా బాబు అనిపించేలా చేస్తుంది.
రీసెంట్ టైంలో డ్రస్సింగ్ సెన్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. కొన్నిరోజుల క్రితం నటుడు శివాజీ.. స్టేజీపై హీరోయిన్ల డ్రస్సింగ్ స్టైల్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ విషయంలో చాలామంది శివాజీని తప్పుపట్టారు. మరికొందరు ఇతడిని సమర్థించారు. అసలు డ్రస్సింగ్ అంటే ఏంటి? ఈ కాలం ఆడపిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు? అనేది చూపించారు. ఇంటికొచ్చిన అతిథుల ముందు కూడా పొట్టిబట్టలేసుకుని కౌంటర్స్ వేసే ఓ కూతురికి.. వయసైన తండ్రి లాగిపెట్టి కొట్టేలా ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు అనేది పాయింట్ స్ట్రెయిట్‌గా చెప్పారు. ఇది చూస్తే కచ్చితంగా చాలామంది అమ్మాయిల ఆలోచనలో మార్పు వచ్చే అవకాశముంటుంది.

ఇక మూడోది టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీ. 2026లోనూ స్వచ్ఛమైన ప్రేమ కావాలనుకునే ఓ కుర్రాడికి అనుకోకుండా ఫోన్ కాల్ ద్వారా 2050లో ఉండే ఓ అమ్మాయి కనెక్ట్ అవుతుంది. రోజూ ఫోన్‌లో మాట్లాడుతూ తెలియకుండానే ఆమె ప్రేమలో పడిపోతాడు. కానీ ఆమెకు ఇతడికి ఓ షాకింగ్ కనెక్షన్ ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఆ ట్విస్టుకి తొలుత ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చి స్టోరీని సుఖాంతం చేశారు. ఏదేమైనా ఈ మూడు స్టోరీలు ప్రస్తుతం సమాజంలో చాలామంది చూస్తున్న చేదు నిజాలే. కానీ కామెడీగా బోల్డ్ టచ్ ఇస్తూ చెప్పడం బాగుంది.
పైన చెప్పిన మూడు కథలతో పాటు ప్రియా భవానీ శంకర్ చేసిన శిల్ప పాత్రకు ఓ స్టోరీ ఉంటుంది. అదేంటనేది ఇందులో పెద్దగా రివీల్ చేయలేదు. త్వరలో వచ్చే మూడో భాగంలో పూర్తిస్థాయిలో చూపిస్తారేమో?
నటీనటుల విషయానికొస్తే.. ప్రియాభవానీ శంకర్, భవానీ శ్రీ, తంబి రామయ్య, ఎమ్ఎస్ భాస్కర్, బ్రిగిడ సాగా.. ఇలా ఎవరికి వాళ్లు తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్‌గానూ బాగుంది. ప్రస్తుతం తమిళంలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. పేరుకే బోల్డ్ సినిమా గానీ అసభ్యకర సన్నివేశాల్లాంటివి లేవు. వీలైతే ఒంటరిగానే చూడండి. కచ్చితంగా నచ్చుతుంది.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: సమంత నుంచి సర్‌ప్రైజ్.. పోస్ట్ వైరల్)


