
ఓటీటీల రాకతో సినిమా చూసే ప్రేక్షకులకు సదుపాయం బాగా పెరిగిపోయింది. ఏ మూవీని థియేటర్‌లో చూడాలి? దేన్ని మొబైల్‌లో చూడాలనేది ముందే ఫిక్సయిపోతున్నారు. మరోవైపు నిర్మాతలు మాత్రం థియేటర్లకు జనాలు రావట్లేదు అని గగ్గోలు పెడుతున్నారు. మరీ నెలలోపే కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తుండటం ఆశ్చర్యపరుస్తుంది. కొన్ని డబ్బింగ్ చిత్రాల పరిస్థితి ఇంకా దారుణం.
గత నెల 20న తమిళంలో 'డీఎన్ఏ' అనే సినిమా రిలీజైంది. పాజిటివ్ టాక్ అందుకుంది. 'గద్దలకొండ గణేష్'తో తెలుగులోనూ నటించిన అధర్వ మురళి ఇందులో హీరోగా నటించాడు. మలయాళ బ్యూటీ నిమిషా సజయన్ హీరోయిన్. 2014లో ఓ సాఫ్ట్‌వేర్, ఆర్టిటెక్ట్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. తమిళంలో మంచి టాక్ వచ్చింది. దీన్ని తెలుగులో 'మై బేబీ' పేరుతో ఈ నెల 18న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇక్కడివరకు బాగానే ఉంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)
ఇప్పుడు సడన్‌గా 'డీఎన్ఏ' ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ నెల 19 నుంచి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ స్ట్రీమింగ్ కానుందని క్లారిటీ ఇచ్చింది. అంటే తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైన ఒక్కరోజుకే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుందనమాట. ఇలా అయితే థియేటర్లకు వెళ్లాలనుకునే ఒకరు ఇద్దరు కూడా వెనకడుగు వేస్తారు. మరి ఓటీటీ డేట్ తెలియకుండా తెలుగులో రిలీజ్ ప్లాన్ చేసుకున్నారా? లేదంటే ఓటీటీ సంస్థ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిందా అనేది తెలియట్లేదు.
'డీఎన్ఏ' విషయానికొస్తే.. ఆనంద్(అధర్వ మురళి) లవ్ ఫెయిలవడంతో తాగుబోతుగా మారతాడు. కొన్నాళ్లకు బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉన్న దివ్య(నిమిషా సజయన్)ని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఆనంద్‌లో మార్పు వచ్చి భార్యతో సంతోషంగా జీవిస్తుంటాడు. కొన్నాళ్లకు దివ్య ప్రెగ్నెంట్ అవుతుంది. డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్తారు. ప్రసవం అయిన కాసేపటికే ఈ బిడ్డ తన బిడ్డ కాదని, ఎవరో మార్చేశారని దివ్య, డాక్టర్లని నిలదీస్తుంది. ఇంతకీ దివ్య చెప్పింది నిజమేనా? చివరకు బిడ్డ దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: సైలెంట్‍గా ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ మూవీ)
