
తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ– ‘‘ఏడేళ్ల క్రితమే ‘మిరాయ్’ ఐడియా పుట్టింది. ఈ సినిమా పూర్తిగా కల్పితం. అశోకుని దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉన్నాయనే మిత్ ఉంది.
ఈ తొమ్మిది గ్రంథాల కోసం దుష్టులు ప్రయత్నించగా, వీటిని మన ఇతిహాసాల ఆధారంగా ఎలా కాపాడవచ్చు? అన్నదే ‘మిరాయ్’ సినిమా కథ. ఈ చిత్రంలో తల్లి–కొడుకుల బలమైన ఎమోషన్ కూడా ఉంది. తల్లి–కొడుకులుగా శ్రియ– తేజ నటించారు. ఆధ్యాత్మిక భావనలు గల అంబిక (శ్రియ పాత్ర పేరు) తన ఆశయం నెరవేరడానికి తన కొడుకుకి ఎలా మార్గనిర్దేశకత్వం చేసింది? అన్నది సినిమాలో చూడాలి. తేజ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం థాయ్‌ల్యాండ్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు.
మనోజ్ రోల్ కథలో చాలా బలంగా ఉంటుంది. హీరోని గైడ్ చేసే అగస్త్య మునిగా జయరామ్, తాంత్రిక గురువుగా జగపతిబాబు నటించారు. జటాయు బ్రదర్ సంపాతి పాత్రని స్ఫూర్తిగా తీసుకొని ఒక సీక్వెన్స్ చేశాం. ట్రైలర్‌లో కనిపించే పక్షి సీక్వెన్స్ ఇది. ఈ పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. రియల్ లొకేషన్స్‌లో ఈ సినిమాను చిత్రీకరించాం. శ్రీలంక, నేపాల్, రాజస్తాన్, బుర్జు, థాయ్‌ల్యాండ్... మొత్తం ఆసియా అంతా తిరిగేశాం. ఈ చిత్రంలో ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. శ్రీలంకలో తేజపై ట్రైన్ నేపథ్యంలో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ ఓ హైలైట్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యకు పరిష్కారం మన ఇతిహాసాల్లోనో, పురాణాల్లోనో ఉందనే నమ్మకంతో ఈ సినిమా కథ చేశాను.
చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన ఇతిహాస కథలు, పాత్రలన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. అయితే ఈ అంశాలన్నింటినీ కథలో ఆసక్తికరంగా బ్లెండ్ చేయడం అనేది నాకు సవాల్‌గా అనిపించింది. ఈ సినిమా బడ్జెట్ కాస్త ఎక్కువగానే అయింది. అయినా విశ్వ ప్రసాద్‌గారు చాలా స పోర్ట్ చేశారు. వీఎఫ్‌ఎక్స్ పనులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారే లోకల్‌గా చేస్తున్నారు.
సినిమాలో వీఎఫ్‌ఎక్స్ బాగుండాలంటే ఒకటి మన దగ్గర డబ్బులు ఉండాలి లేదా మన దగ్గర టైమ్ ఉండాలి. మాకు టైమ్ ఉంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ బాగా వచ్చింది. హరి గౌర సినిమాను ఎలివేట్ చేసే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఓ ఫ్రాంచైజీ బిల్డ్ చేసే స్కోప్ ఉన్న కథ ‘మిరాయ్’. ఈ సినిమా విజయంపై అది ఆధారపడి ఉంటుంది. ఇక దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఏదన్నా ఐడియా ఉన్నప్పుడు వేరేవాళ్లకు కథలు కూడా ఇస్తున్నాను’’ అని అన్నారు.