కోలీవుడ్ యంగ్ స్టార్స్ అశ్విన్, శ్రీతు కృష్ణన్, గురు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్’. జస్విని దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ డిసెంబర్ 5 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి శుక్రవారం ఒక ఎపిసోడ్ చొప్పున ఇప్పటి వరకు మొత్తం 20 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' పరిధిలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అవుతాయి. అదే సయమంలో ఆ ఊరికి కొత్త పోలీస్ ఆఫీసర్ గా వెట్రి మారన్ (అశ్విన్) వస్తాడు. దీంతో పోలీసులంతా ఆయన రాక కోసం ఎదురు చూస్తుంటారు.వారిలో కానిస్టేబుల్ మాసాని(పదినే కుమార్) కూడా ఉంటుంది. అమ్మవారి భక్తురాలైన మాసానికి జరగబోయే కొన్ని సంఘటనలు ముందుగానే తెలుస్తూ ఉంటాయి. ఆ ఊరిలో మూడు హత్యలు జరుగుతాయని మాసానికి తెలుస్తుంది. ఈ విషయాన్ని తోటి పోలీసులకు చెప్పడంతో అలర్ట్ అవుతారు. అయినప్పటికీ.. ఊర్లో మూడు హత్యలు జరుగుతాయి. వారిలో 'ఉమాపతి' కూతురు 'సంధ్య' కూడా ఉంటుంది. ఈ కేసుని సాల్వ్ చేసేందుకు కొత్తగా వచ్చిన పోలీసు ఆఫీసర్ వెట్రి మారన్ రంగంలోకి దిగుతాడు. ఈ మూడు హత్యలు ఎలా జరిగాయి? హత్యల వెనుక ఉన్నదెవరు? ధూల్ పేట్ లో ఏం జరుగుతుంది? అనేదే తెలియాలంటే ‘ఆహా’లో 'ధూల్ పేట్ పోలీస్ స్టేషన్' సిరీస్ చూడాల్సిందే.
ఎలా ఉందంటే.
ఇదొక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఒకేరాత్రి జరిగిన మూడు హత్యలను ఇద్దరు పోలీసు అధికారులు ఎలా ఛేదించారనేదే ఈ సిరీస్ కథ. పగ, ప్రతీకారాల చుట్టూ కథనం తిరుగుంది. ధూల్ పేట్‌లోని రౌడీ రాజకీయాలకు పోలీస్ స్టేషన్‌తో ముడిపెడుతూ.. అత్యంత ఆసక్తికరంగా ఈ సిరీస్‌ని తెరకెక్కించాడు దర్శకుడు జస్విని. ఒకవైపు ఊర్లోని రౌడీ రాజకీయాలు, పాత పగలను చూపిస్తూనే..పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌ని ఆసక్తికరంగా మలిచారు. పగ, ప్రతీకారాలతో రగిలిపోయే ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవడం పోలీసులకు ఎంత కష్టమో అనేది ఈ సిరీస్‌లో చక్కగా ఆవిష్కరించారు.
సిరీస్ ప్రారంభం నుంచే ప్రతి ఎపిసోడ్‌పై ఆసక్తి పెంచేలా కథను నడిపించడంలో దర్శకుడు విజయవంతమయ్యారు. మొదటి ఎపిసోడ్‌లోనే మూడు హత్యల గురించి చెప్పి.. సిరీస్‌పై ఆసక్తిని పెంచేశారు. ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్ హిందీ ఫేమస్ సీరియస్ ‘సీఐడీ’ తరహాలో ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి ఐదు ఎపిసోడ్స్‌లోనే ప్రధాన కథంతా చెప్పేశారు. ఇక ఆరో ఎపిసోడ్ నుంచి ఇన్వెస్టిగేషన్ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. మొత్తం 20 ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ.. కథనం ఆసక్తికరంగా సాగడంతో ఎక్కడ బోర్ కొట్టిన ఫీలింగ్ కలగదు. అయితే ఈ సిరీస్‌కి సీక్వెల్ కూడా ఉంది. మొదటి కేసు సాల్వ్ అయినట్లు ఇందులో చూపించి.. చివరిలో రెండో కేసు కూడా రాబోతున్నట్లు ప్రకటించారు. మొత్తం 50 ఎపిసోడ్స్‌లో ఈ సిరీస్ తెరకెక్కించారట. 20 ఎపిసోడ్స్‌తో మొదటి కేసు పూర్తయింది. ఇప్పుడు రెండో కేసు ప్రారంభానికి రంగం సిద్ధమవుతుంది. అదెలా ఉంటుంటో చూడాలి. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సిరీస్ నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
పోలీస్ ఆఫీసర్లుగా అశ్విన్, గురు లక్ష్మణన్ చక్కగా నటించారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో లక్ష్మణన్ పండించే వినోదం నవ్వులు పూయిస్తుంది. సీరియస్ అండ్ సిన్సియర్ పోలీసు ఆఫీసర్‌గా ఆశ్విన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక అమ్మవారు భక్తురాలైన కానిస్టేబుల్ మాసాని పాత్రలో పదినే కుమార్ ఒదిగిపోయింది. శ్రీతు కృష్ణన్, ప్రీతి శర్మతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ వెబ్ సిరీస్ బాగుంది. అశ్వత్ నేపథ్య సంగీతం సిరీస్ స్థాయిని పెంచేసింది. సతీశ్ కుమార్ సినిమాటోగ్రఫీ, సామ్ ఆర్డీఎక్స్ ఎడిటింగ్ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.


