ఇళయరాజాగా ధనుష్‌..! | Dhanush As Ilayaraja In His Biopic | Sakshi
Sakshi News home page

ఇళయరాజాగా ధనుష్‌..!

Nov 2 2023 6:43 AM | Updated on Nov 2 2023 8:43 AM

Dhanush As Ilayaraja In Biopic - Sakshi

నటుడు ధనుష్‌, సంగీత దర్శకుడు ఇళయరాజాగా మారనున్నారా అన్న ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. బహుభాషా నటుడిగా రాణిస్తున్న ధనుష్‌ తమిళంతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అంత బిజీలోనూ ప్రస్తుతం మెగాఫోన్‌ పట్టి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరోగానూ నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇది ఈయన నటిస్తున్న 50వ చిత్రం కావడం విశేషం. దీంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న 51వ చిత్రంలోనూ నటిస్తున్నారు.

కాగా ధనుష్‌ నటించిన కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇది పీరియడ్‌ కథాంశంతో తెరకెక్కుతున్న కథా చిత్రం. కాగా సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మెలోడి మాస్టర్‌. తన సంగీతంతో గుక్కపట్టి ఏడ్చే పసిపిల్లలను కూడా చిరునవ్వులతో కేరింతలు కొట్టించే శక్తి ఈయన సంగీతంలో ఉందనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. నాలుగు దశాబ్దాలకు పైగా సంగీత ప్రియులను అలరిస్తున్న ఇళయరాజా 1000 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించి అసాధారణ రికార్డును సాధించారు.

కాగా సంగీత మేధావి బయోపిక్‌ చిత్రంగా తెరకెక్కనున్నట్లు, దీనిని ఆయనే నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత ఆ ఊసే లేదు. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఇళయరాజా బయోపిక్‌ గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో ఇళయరాజాగా ధనుష్‌ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్‌. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ చిత్రం 2024లో సెట్‌పైకి వెళ్లనుందని, 2025లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement