
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padukone) అస్కార్ అవార్డ్స్-2025 గురించి మాట్లాడారా. ఈ ఏడాదిలో భారత్‌కు అవార్డ్స్ రాకపోవడంతో ఆమె విచారం వ్యక్తం చేశారు. పారిస్‌లో జరుగుతున్న లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ లూయిస్ విట్టన్ (Louis Vuitton) షోలో ఆమె పాల్గొంటుండగా ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
ఆస్కార్ అవార్డులు గెలుపొందే అన్ని అర్హతలు ఉన్న అనేక భారతీయ చిత్రాలు ఉన్నాయని దీపికా పదుకొణె చెప్పారు. భారతీయ అభిమానుల హృదయాలను గెలుచుకున్న 'ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్, మిస్సింగ్ లేడీస్' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికల మీద ప్రశంసలు అందుకున్నాయి. అయినప్పటికీ ఈ రెండు చిత్రాలు ఆస్కార్- 2025 తుది జాబితాలో చోటు దక్కలేదు. ఇలా చాలాసార్లు మనకు రావాల్సిన ఆస్కార్లను లాగేసుకుంటూనే ఉన్నారు. భారతదేశ సినీ చరిత్రలో ఎన్నో గొప్ప కథలు తెరకెక్కాయి. కానీ, ఆ సినిమాలకు, ఆ కథలకు, నటీనటుల ప్రతిభకు గుర్తింపు ఇవ్వడం లేదు. కారణం ఏంటో తెలియదు. కానీ, ఆస్కార్ మాత్రం మన సినిమాలను తిరస్కరిస్తుంది. అయితే, ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులలో ది బ్రూటలిస్ట్ చిత్రానికి గాను నటుడు అడ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు రావడం నాకు సంతోషాన్ని ఇచ్చింది.
RRR అవార్డ్.. ఎంతో భావోద్వేగం చెందాను:దీపికా
భారత్ నుంచి ఎన్నో విలువైన చిత్రాలు వచ్చినప్పటికీ అస్కార్ అవార్డ్ దక్కకపోవడం చాలా బాధాకరం అని చెప్పిన దీపికా పదుకొణె.. ఆర్‌ఆర్‌ఆర్ గురించి కూడా మాట్లాడారు. '2023 ఆస్కార్ అవార్డ్స్ నేను వ్యాఖ్యతగా ఉన్నాను. కానీ, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి ఆస్కార్ ప్రకటించిన సమయంలో నేను ప్రేక్షకుల్లో కూర్చొని ఉన్నాను. అప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను. అవి నాకు ఎంతగానో ప్రత్యేకమైన క్షణాలు. ఆ సినిమాలో నేను భాగం కాకపోయినప్పటికీ ఒక భారతీయురాలిగా ఆ విజయం నా సొంతం అనిపించింది. ఆ గొప్ప క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను.'అని చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో రామ్‌చరణ్,ఎన్టీఆర్ నటించారు. ఇందులో నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే.