దీపికా పదుకొణెతో మీరు కూడా మాట్లాడొచ్చు.. తొలి భారతీయ సెలబ్రిటీగా రికార్డ్‌ | Deepika Padukone Becomes First Indian actress To Lend Her Voice with Meta AI | Sakshi
Sakshi News home page

దీపికా పదుకొణెతో మీరు కూడా మాట్లాడొచ్చు.. తొలి భారతీయ సెలబ్రిటీగా రికార్డ్‌

Oct 16 2025 8:00 AM | Updated on Oct 16 2025 9:34 AM

Deepika Padukone Becomes First Indian actress To Lend Her Voice with Meta AI

భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంటారు నటి దీపికా పదుకొణె (Deepika Padukone). కేవలం తన నటనతోనే కాకుండా తన స్పీచ్‌లతోనూ అభిమానులను ఆకట్టుకుంటుంటారు. అందుకే ఆమెకు మరో అరుదైన గౌరవం దక్కింది. మెటా AIకి తన గొంతును అందించిన తొలి భారతీయ సెలబ్రిటీగా  ఆమె  నిలిచింది. తాను ఇప్పుడు మెటా ఏఐలో భాగమైనట్లు ఒక వీడియోతో సోషల్‌మీడియాలో పంచుకున్నారు.  ఆమెకు మరోసారి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది.

మెటా ఇటీవల ప్రత్యేక ఏఐ చాట్‌బాట్‌ యాప్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.  వివిధ రకాల టెక్స్ట్, ఇమేజ్, వీడియో డేటాతో శిక్షణ  ఇవ్వడం వల్ల మీరు అడిగే ప్రశ్నను కూడా విస్తృత స్థాయిలో అర్థం చేసుకుంటుంది. మీతో చాటింగ్‌ చేయడమే కాకుండా  వాయిస్‌తో సలహాలు, కబుర్లు కూడా చెబుతుంది. మీకు కావాల్సింది ప్రాంప్ట్‌లను అందిస్తే చాలు మాట్లాడేస్తుంది. ఏదైనా అంశం మీద లోతుగా తెలుసుకోవాలనుకుంటే విశ్లేషణ కూడా చేస్తుంది. ఇప్పుడు ఇవ్వన్ని మీ అభిమాన నటి దీపికా పదుకొనె వాయిస్‌తో మీరు వినేయవచ్చు. ఆమెతో ఎప్పుడైనా  మాట్లాడవచ్చు. కానీ, ఆమె వాయిస్‌ మాత్రం ఏఐ ఆధారంగా మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది.

వాయిస్‌ ఇన్‌పుట్స్‌తో మెటా ఏఐ అసిస్టెంట్‌ పనిచేస్తుంది. ఇప్పుడు దానికి  దీపికా పదుకొణె వాయిస్‌ తోడవుతుంది.  అంటే స్నేహితుడితో మాట్లాడినట్టుగా ఎప్పుడైనా దీపికతో మాట్లాడొచ్చన్నమాట. మెటా ఏఐలో హాలీవుడ్‌ నుంచి కొంతమంది ప్రముఖుల వాయిస్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇండియా నుంచి మాత్రం కేవలం దీపికా పదుకొనె వాయిస​్‌ మాత్రమే అందుబాటులోకి రానుంది.

ఈ క్రమంలోనే దీపిక ఒక వీడియోను షేర్‌ చేసుకున్నారు. ఇది చాలా బాగుంది అని తాను అనుకుంటున్నట్లు పేర్కంది. తాను ఇప్పుడు మెటా AIలో భాగమయ్యానని దీంతో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ అంతటా తన వాయిస్‌తో ఇంగ్లీషులో చాట్ చేయవచ్చని ఆమె పంచుకున్నారు. ఒక్కసారి దీనిని ప్రయత్నించి ఏమనుకుంటున్నారో  తెలియజేయాలని ఆమె కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement