
బాలీవుడ్‌లో 80–90లలో హిందీ సినిమా ప్రపంచం, అండర్ వరల్డ్ గ్యాంగ్‌ల మధ్య సంబంధాలపై ఎన్నో రకాల వార్తలు, కధనాలు, విశ్లేషణలు, చర్చలు సాగాయి. మరీ ముఖ్యంగా ఆ సమయంలో సినీ కథానాయికలు, మాఫియా డాన్‌లతో సంబంధాలు పెట్టుకున్నట్టు పలు రహస్యాలు సైతం బయటికి వచ్చాయి. అందులో చాలా మందికి తెలిసిన ఒక బహిరంగ రహస్యం దావూద్–మందాకినిల ఎఫైర్ అయితే, అతి కొద్ది మందికే తెలిసిన మరో కథలో అనితా అయూబ్ అనే హీరోయిన్ ప్రధాన పాత్రధారిణి.
అనితా ఎవరు?
పాకిస్థాన్‌లో పుట్టిన కరాచీ కు చెందిన అనితా అయూబ్ ఆంగ్ల భాషలో మాస్టర్స్ చేసింది. ఆ తర్వాత మన దేశంలో అడుగుపెట్టి రోషన్ తనేజా యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంది. చిన్న చిన్నగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ మొదట మోడల్‌గా, ప్రకటనల్లో నటించి, 1993లో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆమె దేవ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ప్యార్ కా తరానా చిత్రంలో హీరోయిన్‌గా పరిచయమయ్యారు.
ఆ తరువాత 1994లో వచ్చిన గ్యాంగ్ స్టర్ చిత్రంలో కూడా నటించింది. బహుశా అందరు హీరోయిన్లలాగే అయితే ఆమె మరిన్ని చిత్రాల్లో నటించి ఇప్పటికీ కొనసాగుతూనే ఉండేదేమో.. కానీ ఆమె ఒకటి తలిస్తే..అప్పటి బాలీవుడ్‌ని శాసించిన నేర సామ్రాజ్య చక్రవర్తి మరొకటి తలచాడు.

మాఫియా పడగ నీడలో...
అందం, అభినయం ఉన్న అనితాపై నాటి మాఫియా డాన్ దావూద్ ఇబ్రాహీమ్(Dawood Ibrahim) మనసు పడ్డాడు. దాంతో ఆమె జీవితం మారిపోయింది. తరచుగా దావూద్‌తో ఆయన సహచరులతో కలిసి అనితా కనిపిస్తుండడంతో వీరిద్దరి మధ్య సంబంధాలు ఏర్పడాయంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఆమె ఎప్పుడూ ఈ వివాదాన్ని బహిరంగంగా ఒప్పుకోలేదు, కానీ సినీ పరిశ్రమ మాత్రం పూర్తిగా నమ్మింది. దానికి బలమైన కారణాలు కూడా లేకపోలేదు.
అందులో ఒక ప్రధాన కారణం అప్పట్లో జరిగిన ఓ బాలీవుడ్ నిర్మాత హత్య. 1995లో నిర్మాత జావేద్ సిద్ధీక్ ఓ చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు. అయితే ఆ సినిమాలో అనితాను హీరోయిన్‌గా తీసుకోవాలని మాఫియా నుంచి ఒత్తిడి వచ్చింది. అయితే ఈ ఒత్తిడికి ఆయన తలొగ్గలేదు. దీనితో దావూద్ గ్యాంగ్ తన సత్తా చూపిందనీ, నిర్మాత సిద్ధీక్‌ను హత్య చేయించడం ద్వారా దావూద్ అనితా పై తనకున్న గాఢమైన ఇష్టాన్ని చూపించాడంటూ వార్తలు వచ్చాయి. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సంఘటన మీడియాలో దావూద్ అనితల ప్రేమాయణంపై రకరకాల చర్చలకు కారణమైంది.
అయితే దావూద్‌తో అనుబంధంతో పాటు అనితా కష్టాలు కూడా పెరుగుతూ వచ్చాయని అంటారు. ఆ తర్వాత ఒక పాకిస్థానీ పత్రిక కధనం ప్రకారం అనితా అయూబ్ భారతదేశంలో పాక్ గూఢచారిణిగా అనుమానించడం మొదలైంది. అంతే ఇక తర్వాత బాలీవుడ్ ఆమెను పూర్తిగా పక్కన బెట్టేసింది.
దాంతో అనితా నటనకు గుడ్‌బై చెప్పి స్వదేశానికి మూటా ముళ్లె సర్ధుకుని పీఛేముఢ్ అనక తప్పలేదు. పాకిస్తాన్‌లో ఉంటూనే తర్వాత కొన్నాళ్లకు భారత వ్యాపారి సంయమిల్ పటేల్‌ను వివాహం చేసుకొన్న అనితా..ఆ తర్వాత కొన్నాళ్లకే ఆ బంధం ముక్కలవడంతో, విడాకులు తీసుకుంది. అనంతరం పునః వివాహం పాకిస్థాన్ వ్యాపారి సుబాక్ మజీద్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం ఆమె అమెరికాలోని న్యూయార్క్‌లో స్థిరపడింది.