
ఫోర్జరీ చేసి శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పత్రాలను జగన్‌మోహన్‌రావు సృష్టించారు
వాటి ఆధారంగానే హెచ్‌సీఏలోకి ప్రవేశం.. ఆపై నిధుల గోల్‌మాల్
నిందితుల అరెస్ట్‌పై సీఐడీ అదనపు డీజీ చారు సిన్హా ప్రకటన
నిందితులకు 22 వరకు జుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలను సృష్టించి మోసానికి పాల్పడటంతోపాటు నిధుల గోల్‌మాల్‌కు పాల్పడిన నేరంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. జగన్‌మోహన్‌రావు సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధర్మ గురువారెడ్డి ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రావు, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ సి. రాజేందర్ యాదవ్, ఆయన భార్య జి. కవితతో కలిసి ఈ కుట్రకు తెరతీసినట్లు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. గౌలిపుర క్రికెట్ క్లబ్‌గా పిలిచే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు సి. కృష్ణ యాదవ్ సంతకాలను ఫోర్జరీ చేసి డాక్యుమెంట్లను జగన్‌మోహన్‌రావు సృష్టించారు.
వాటి ఆధారంగానే ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కాగలిగినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. ఆ తర్వా త హెచ్‌సీఏ సీఈఓ సునీల్ కంటే, ట్రెజరర్ సీఏ శ్రీనివాసరావు ఇతరులతో కలిసి నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఫ్రాంచైజీ అధికారులను బెదిరించడం.. కాంప్లిమెంటరీ టికెట్ల కోసం బ్లాక్ మెయిల్ చేయడం, కార్పొరేట్ బాక్స్‌లను అ«దీ నంలో పెట్టుకోవడం వంటివి చేసినట్లు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. ప్రాథమిక ఆధారాల మేరకు ఈ నెల 9న జగన్‌మోహన్‌రావు, శ్రీనివాసరావు, సునీల్ కంటే, రాజేందర్‌యాదవ్, జి.కవిత లను అరెస్టు చేసినట్టు సీఐడీ అడిష నల్ డీజీ చారు సిన్హా తెలిపారు.
రూ. కోట్లలో అవినీతి!
జగన్‌మోహన్‌రావు కేసులో పలు సంచలన విషయా లు బయటకు వస్తున్నాయి. రెండేళ్లలో రూ. కోట్లలో గోల్‌మాల్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఆటగాళ్ల ఎంపికలో అవినీతి జరిగిందని, ఆటగాళ్ల తల్లిదండ్రులు నుంచి హెచ్‌సీఏ సభ్యులు డబ్బు వసూలు చేశారని సీఐడీ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. చెక్ పవర్ దురి్వనియోగం, బీసీసీఐ ద్వారా వచి్చన నిధుల్లో గోల్‌మాల్, ఎస్‌ఆర్‌హెచ్ నుంచి కాంప్లిమెంట్రీ పాస్‌లను బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకోవడం, క్రీడాకారుల కోసం ఉపయోగించాల్సిన కాంప్లిమెంటరీ పాస్‌లలోనూ భారీ అవినీతి తదితర అంశాలపై సీఐడీ ఫోకస్ పెంచినట్లు సమాచారం. అదేవిధంగా తమను వేధించారంటూ జగన్‌మోహన్‌రావుపై ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఆరోపించిన నేపథ్యంలో యాజమాన్యం వాంగ్మూలాన్ని సైతం సీఐడీ అధికారులు నమోదు చేసినట్లు తెలిసింది.
నిందితులకు 12 రోజుల జుడీషియల్ రిమాండ్
జగన్‌మోహన్‌రావు సహా ఇతర నిందితులను సీఐడీ గురువారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కోర్టులో హాజరుపరచగా ఈ నెల 22 వరకు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో మహిళా నిందితురాలు కవితను చంచల్‌గూడలోని మహిళా జైలుకు మిగతా నిందితులను చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్ కోసం సీఐడీ గాలిస్తోంది. కాగా, నిందితులను మరింత లోతుగా ప్రశ్నించడం కోసం వారిని తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది.