కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు స్టార్ హీరో ఇంటికి చేరుకుని తనీఖీలు చేపట్టారు. చెన్నైలోని ఇంజంబక్కంలో ఉన్న అజిత్ కుమార్ ఇంటితో పాటు ఈవీసీ ఫిల్మ్ సిటీ ప్రాంతంలో బాంబులు ఉన్నాయంటూ డీజీపీ ఆఫీస్‌కు మెయిల్ వచ్చినట్లు సమాచారం. అయితే పోలీసుల సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని తెలుస్తోంది. సోదాలు నిర్వహించిన తర్వాత పోలీసులు ఇదంతా బూటకమని నిర్ధారించారు.
అయితే ఇటీవల కొద్ది కాలంగా కోలీవుడ్ ప్రముఖులకు బాంబు బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్, ధనుశ్, విజయ్, త్రిష, నయనతార లాంటి వాళ్లకు కూడా బెదిరింపులు వచ్చాయి. అంతేకాకుండా ఎస్వీ శేఖర్, నటి రమ్యకృష్ణ ఇళ్లకు కూడా బాంబు బెదిరింపులొచ్చాయి. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలపై పోలీసులు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గతనెల అక్టోబర్‌లో స్వరకర్త ఇళయరాజా స్టూడియోకు కూడా బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ప్రముఖ సినీ, రాజకీయ నాయకలు ఇళ్ల వద్ద భద్రతా చర్యలను పెంచేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
అయితే ఇలా జరగడం కేవలం సినిమా వాళ్లకే కాదు.. చెన్నైలోని అనేక కీలక ప్రదేశాల్లో బాంబు పెట్టామని ఇటీవల చాలాసార్లు బెదిరింపులొచ్చాయి. వీటిలో ముఖ్యమంత్రి నివాసం, ప్రతిపక్ష నాయకుడి ఇల్లు, గవర్నర్ భవనం, ప్రధాన రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. ఇలా తరచుగా జరగడంపై చెన్నై నగరంలో భద్రతపై ప్రతి ఒక్కరిలో ఆందోళన వ్యక్తమవుతోంది.


