బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఏడాదిలో ఛావా, ధురందర్ చిత్రాలతో ఆయనకు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు దక్కింది. అయితే, బాలీవుడ్ సినిమా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం -3’ నుంచి ఆయన ఆకస్మికంగా తప్పుకోవడంతో అక్షయ్ ఖన్నాకు నిర్మాత మంగత్ పాఠక్ నోటిసులు పంపినట్లు తెలుస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది అక్టోబర్లో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
హిందీ ‘దృశ్యం -2’లో అక్షయ్ ఖన్నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందుకే పార్ట్-3లో కూడా ఆయనే నటించాలని ముందుగానే ఢీల్ సెట్ చేసుకున్నామని పాఠక్ చెప్పారు. ఆ మేరకు అక్షయ్ ఖన్నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చామన్నారు. అయితే, షూటింగ్ ప్రారంభం కావాల్సిన టైమ్‌లో అక్షయ్ ఖన్నా తమకు షాకింగ్ మెసేజ్ చేశాడని నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను నటించడం లేదంటూ ఒక టెక్స్ట్ మెసేజ్ పంపినట్లు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తనను సంప్రదించాలని ప్రయత్నం చేసినప్పటికీ అక్షయ్ అందుబాటులోకి రాకపోవడంతో చేసేదేమీ లేక చట్టపరమైన చర్యలకు దిగాల్సి వచ్చిందని నిర్మాత చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ కోసం అక్షయ్ ఖన్నా రూ. 22 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
అక్షయ్ ఖన్నాకి సినిమా అవకాశాలు రానప్పుడు ‘సెక్షన్ 375’ మూవీతో మంగత్ పాఠక్ లైఫ్ ఇచ్చాడు. ఆ తర్వాతే అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘దృశ్యం 2’ భారీ విజయం అందుకోవడంతో ఛావా, ధురంధర్ వంటి సినిమాలు దక్కాయి. ఇదే విషయాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.


