కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ ఏడాది విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో అభిమానులను అలరించాడు. వీటిలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్ హిట్‌గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో అజిత్ మరోసారి ఆయనతో జతకట్టనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ వెల్లడించారు.
చెన్నైలో ఓ ఈవెంట్‌కు హాజరైన దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ గుడ్ న్యూస్ పంచుకున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని వెల్లడించారు. మేము ఇప్పుడు లొకేషన్స్ ఖరారు చేస్తున్నామని.. ఫిబ్రవరి చివరి నాటికి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశముంది.
కాగా.. అజిత్ కుమార్ ఈ ఏడాది సినిమాలతో పాటు కార్ రేసింగ్లోనూ దూసుకెళ్తున్నారు. ఇటీవలే ఇటలీకి చెందిన మోటార్‌స్పోర్ట్స్ గ్రూప్ నుంచి 'జెంటిల్‌మన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డును గెలుచుకున్నారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ప్రశంసలు అందుకుంది.


