తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులు తమకంటూ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌లు సృష్టించుకోవడం కొత్తేమీ కాదు. ఒక సినిమాలో పాత హిట్ సినిమాల రిఫరెన్సులు, క్యారెక్టర్లు వాడుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడం ఇప్పుడు ట్రెండ్‌గా మారిన విషయం తెలిసిందే.
అలాంటి మరో యూనివర్స్ క్రియేట్ చేసే అవకాశం గురించి దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా స్పందించారు. చిరంజీవి, వెంకటేశ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో పెట్టి సినిమా తీసిన ఆయన, ఈ కాంబినేషన్‌తో యూనివర్స్ సృష్టించే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేశ్ పోలీస్ పాత్రలో కనిపించారు. కానీ చిరంజీవి సినిమాలో మాత్రం ఆయనను మైనింగ్ డాన్ వెంకీ గౌడగా చూపిస్తున్నట్టు అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. అంటే ఈ రెండు సినిమాలు ఒకే యూనివర్స్‌లో లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు.
అయితే భవిష్యత్తులో వెంకటేశ్‌తో మరో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం అందులో తప్పకుండా చిరంజీవి క్యామియో పెట్టే ప్రయత్నం చేస్తాను. అప్పుడు తనకంటూ ప్రత్యేకమైన వరప్రసాద్ యూనివర్స్‌ను సృష్టిస్తానని ఆయన చెప్పారు.
అంటే రాబోయే రోజుల్లో వెంకీ హీరోగా నటించే సినిమాలో చిరంజీవి శంకర వరప్రసాద్‌గా కనిపించే అవకాశం ఉందన్నమాట. ఈ ఆలోచన నిజంగా ప్రేక్షకులకు పెద్ద కిక్ ఇచ్చేలా ఉంది. అభిమానులు కూడా ఆ రోజు త్వరగా రావాలని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు.


