కోలీవుడ్‌లో సడెన్‌గా హీరో కార్తీ సినిమా రేసులోకి వచ్చేసింది. విజయ్ మూవీ జన నాయగన్ వాయిదా పడటంతో పొంగల్ రేసులో పెద్దగా సినిమాలు లేవు. తమిళనాట ప్రస్తుతం శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ మాత్రమే ఉంది. దీంతో ఇదే సరైన సమయం అని భావించిన మేకర్స్ సడెన్‌గా 'అన్నగారు వస్తారు' విడుదల తేదీని ప్రకటించారు. వాస్తవంగా ఈ మూవీ కూడా డిసెంబరు 12న విడుదల కావాల్సి ఉంది. పలు ఆర్థిక కారణాలతో వాయిదా పడింది.
తాజాగా ఆ సమస్యలన్నీ పూర్తి కావడం వల్ల విడుదలకు లైన్ క్లియర్ అయింది. దీంతో జనవరి 14న ‘వా వాతియార్’(అన్నగారు వస్తారు)ను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తెలిపింది. అయితే, తెలుగు వర్షన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలదే. ఇక్కడ థియేటర్స్ దొరకడం కష్టం కాబట్టి సంక్రాంతి తర్వాత తెలుగులో విడుదల కావచ్చు. దర్శకుడు నలన్ కుమారస్వామి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇందులో కృతీ శెట్టి కథానాయికగా నటించారు. కామెడీతో పాటు యాక్షన్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు.

ఎందుకు వాయిదా పడింది..?
అన్నగారు వస్తారు మూవీ నిర్మాత జ్ఞానవేల్ రాజా.. కొన్నేళ్ల క్రితం అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తి దగ్గర రూ.10 కోట్ల వరకు ఫైనాన్స్ తీసుకున్నారు. కానీ, ఆ మొతాన్ని తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో వడ్డీలతో కలిపి ఆ మొత్తం ఇప్పుడు రూ.21.78 కోట్లకు చేరుకుంది. ఈ విషయంలో కొన్నిరోజుల క్రితమే అర్జున్.. మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో నిర్మాత జ్ఞానవేల్ రాజా.. అర్జున్ లాల్‌కి మొత్తం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. సదరు మొత్తాన్ని చెల్లించేవరకు సినిమాని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, తాజాగా ఈ సమస్య లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.


