'హీరోయిన్ షాలిని తండ్రి హోటల్‌లో గిన్నెలు కడిగేవాడు.. కూతురిని లేటుగా సెట్‌కు తీసుకెళ్లినందుకు ఓ డైరెక్టర్ చేతిలో తన్నులు తిన్నాడు.. ఒకప్పుడు పేదవాడిగా ఉండి ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు తమిళ దర్శకుడు అలెప్పీ అష్రఫ్. మీడియాకు దూరంగా ఉండే షాలిని తండ్రి బాబు... ఈ వ్యాఖ్యాలపై స్పందించాడు. అవన్నీ నిజం కాదని కొట్టిపారేస్తున్నాడు.
నన్ను కొడుతుంటే షాలిని ఏడుస్తూ ఉందా?
మనోరమ ఆన్‌లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు మాట్లాడుతూ.. అలెప్పీ అష్రఫ్ (Alleppey Ashraf) నాకు చాలా ఏళ్లుగా తెలుసు. మా కుటుంబానికి చాలా క్లోజ్. మేమెలాంటివాళ్లమో తనకు బాగా తెలుసు. అయినప్పటికీ మా గురించి అలాంటి వీడియో ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. పోనీ, చేసేముందు మాకో మాటైనా చెప్పలేదు. తను చెప్పినదాంట్లో దాదాపు అన్నీ అబద్ధాలే.. మలయాళ నటుడు కుంచకొ తండ్రి, దర్శకనటుడు బొబన్ నన్ను చెంపదెబ్బ కొట్టి.. చితకబాదుతుంటే నా కూతురు చూసి ఏడ్చిందట! అది పూర్తిగా అసత్యం.
ఒకటి నిజం
బొబన్ అలాంటివారు కానే కాదు. అయితే ఒకటి మాత్రం నిజం. Aazhi (1985) మూవీ సెట్‌కు సమయానికి వెళ్లలేకపోయాం. ఎందుకంటే బొబన్ సినిమాకు సంతకం చేయడానికి ముందే నా కూతురు షాలిని (Shalini) మరో సినిమా చేస్తోంది. ఆ మూవీ షూటింగ్ నిమిత్తం మేము విదేశాల్లో ఉన్నాం. దానివల్ల ఒకరోజు ఆలస్యంగా సెట్‌కు వచ్చాం. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మాకంటే సినీ ఫ్యామిలీలో పుట్టిన బొబన్‌కే బాగా తెలుసు. అయినప్పటికీ మాపై కాస్త కోప్పడ్డాడు.

షాలిని కుటుంబం
ఇది మరీ కామెడీ!
పరిస్థితి ఇదీ.. అని మేము వివరించేసరికి తను కాస్త శాంతించాడు. అంతే తప్ప ఆయన నాపై చేయి ఎత్తలేదు. ఆయనే కాదు, ఎవరూ నన్ను కొట్టే పరిస్థితి నేను తెచ్చుకోలేదు. మేమెప్పుడూ ప్రేమగానే మసులుకునేవాళ్లం. అలాంటిది బొబన్ కొడితే ఆ దెబ్బకు నేను చెరువులో పడ్డానని, దెబ్బలు తగిలాయని, వేరేవాళ్లు నన్ను కాపాడారని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. పైగా నాకు ఈత వచ్చు. చెరువులోనే కాదు, సముద్రంలోనూ ఈత కొట్టగలను.
అదేమైనా చేయకూడని పనా?
అష్రఫ్ ఇంకా ఏమన్నారు.. షాలిని సినిమాల్లోకి రాకముందు హోటల్‌లో పని చేశానా? మురికివాడలో నివసించానా? నేను గిన్నెలు కడగడం, టేబుల్ క్లీన్ చేయడం అష్రఫ్ చూశాడా? ఎందుకీ అబద్ధాలో అర్థం కావడం లేదు. ముందుగా.. హోటల్‌లో పని చేయడం చిన్నతనమేమీకాదు. పొట్టకూటికోసం ఏదైనా చేసుకోవచ్చు. దేవుడి దయవల్ల నాకలాంటి అవసరం రాలేదు. నేను ఓ ఫ్యాన్సీ షాప్ రన్ చేసేవాడిని. మరో విషయం ఏమన్నాడు? నా భార్య జూనియర్ ఆర్టిస్టా? తనకసలు సినిమాలంటేనే ఆసక్తి లేదు. ఇల్లు వదిలి బయటకు రాదు. నా పిల్లలిద్దరికీ సినిమా ఛాన్సులు వచ్చినప్పుడు నేనే వాళ్లను పట్టుకుని తిరిగానే తప్ప తనెప్పుడూ మాతో రాలేదు. రమ్మని అడిగితే ఇంట్లోనే ఉంటాననేది.
రూ.100 కోట్ల ఆస్తి?
ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించానని, ఇప్పుడు రూ.100 కోట్ల ఆస్తి ఉందన్నాడు. అంత కరెక్ట్‌గా ఎలా చెప్పగలడో మరి? దేవుడి దయవల్ల మేము మంచి స్థాయిలోనే ఉన్నాం. ఇంకోటి.. అజిత్ (Ajith Kumar) రూ.180 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అవును, తన రేంజ్‌ను బట్టి ఎంతైనా తీసుకుంటాడు. దాని ప్రకారమే ట్యాక్స్ కూడా కరెక్ట్‌గా కడతాడు. మరింకేంటి సమస్య? అష్రఫ్ మీద నాకెలాంటి కోపం లేదు. మేమిద్దరం గల్ఫ్ దేశంలో ఓ స్కిట్ కూడా చేశాం. అదిప్పటికీ నాకు బాగా గుర్తు. మరి తనెందుకు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశాడో అంతు చిక్కడం లేదు అని బాబు చెప్పుకొచ్చాడు.
సినిమా
ఎలైస్-బాబు దంపతులకు కూతుర్లు షాలిని, షామిలి, కొడుకు రిచర్డ్ సంతానం. ఈ ముగ్గురూ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసిన షాలిని.. 2000వ సంవత్సరంలో అజిత్‌ను పెళ్లాడింది. వీరికి ఓ కూతురు, కుమారుడు సంతానం. వివాహం తర్వాత షాలిని మూవీస్‌కు గుడ్‌బై చెప్పింది.
చదవండి: పసిబిడ్డను చంపేయమని అడిగా.. నాపై ఉమ్మేశారు!: కస్తూరి


