తొలి సీజన్ నుంచి బిగ్‌బాస్ షోలో సామాన్యులు పాల్గొన్నప్పటికీ మహా అయితే ఒకటి రెండు వారాలకు మించి ఉండేవాళ్లు కాదు. ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్, కల్యాణ పడాల లాంటి వాళ్లు ఏకంగా విజేతలయ్యారో.. కామనర్స్ అనే పదానికి విలువ పెరిగింది. వీళ్లని ఎంపిక చేసేందుకు పెట్టిన అగ్నిపరీక్ష పోటీపైనే ఆడియెన్స్‌కి ఆసక్తి కలిగింది. అలా ఈసారి జరిగిన అగ్నిపరీక్షలో నెగ్గిన సింగర్ ఝాన్సీ ఇప్పుడు సగర్వంగా బిగ్‌బాస్ 10 హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టేసింది.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. ఎలాంటి సంగీత నేపథ్యం, సౌకర్యాలు లేనప్పటికీ జానపద పాటలు పాడుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పొలంలో పనులు చేస్తూనే చదువులోనూ టాపర్‌గా నిలిచింది. తెలంగాణ జానపద గీతాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
రామ్ రెడ్డి దొర, అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య, అందాల రాధ, కాసరం కట్ట వంటి జానపదాలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మాస్, ఎనర్జిటిక్ వాయిస్‌తో అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఝాన్సీ పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ ఆడిషన్స్‌లోనూ తన మాటలతో జ్యూరీని ఆకట్టుకున్న ఝాన్సీ.. అగ్నిపరీక్ష సీజన్ 2లో తనదైన గేమ్‌తో గెలిచి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి సెలబ్రిటీలతో పోటీపడి ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?


