
హరిత హరీశ్, మాస్క్ మ్యాన్, హృదయ మానవ్.. ఇవన్నీ ఒక్కరి పేర్లే! అయినా హరీశ్.. మాస్క్ మ్యాన్‌గానే ఎక్కువ ఫేమస్. అగ్నిపరీక్షలో అతడి ముక్కుసూటితనం మెచ్చిన జడ్జిలు బిగ్‌బాస్ 9కి పంపారు. ఈ సీజన్‌లో తిరుగులేని కంటెస్టెంట్ అనుకున్నారు. అతడికి ఎవరూ ఎదురునిలబడలేరనుకున్నారు. కానీ బిగ్‌బాస్ హౌస్‌లో అంతా తలకిందులైంది. హౌస్‌లో అగ్గిరాజేస్తాడనుకుంటే తనే అగ్గిలో దూకి బూడిదలా మిగిలాడు (Mask Man Haritha Harish).
అలక బూనిన హరీశ్
ఇతడు ముక్కుసూటిగా మాట్లాడతాడు. కానీ చిన్న విషయాన్ని పట్టుకుని అక్కడే ఆగిపోతాడు. షోలో గొడవలు కామన్.. అప్పుడే పోట్లాడుకుంటారు, అంతలోనే కలిసిపోతారు. కానీ ఇతడు మాత్రం గొడవ దగ్గరే ఆగిపోయాడు. అవతలివారు కలుపుకుపోవాలన్నా కూడా దూరం పెట్టాడు. జనాలు అతడిని ఇంకొన్నివారాలు ఉంచాలనుకున్నా సరే నేను రానంటూ ఒక మూలన సైలెంట్‌గా కూర్చుండిపోయాడు. అన్నం మీద అలక చూపించాడు.
ఆ ఒక్క సంఘటనతో సైలెంట్
'ఇన్నాళ్లూ ఇమ్మాన్యుయేల్, భరణి మగాళ్లనుకున్నా.. కానీ ఆడవాళ్లతో ఫైట్ చేస్తున్నానని ఇప్పుడర్థమైంది' అని ఆవేశంలో ఓ కామెంట్ పాస్ చేశాడు. దీంతో ఆడవాళ్లంటే అంత చులకనా? అని అతడికి పెద్ద క్లాస్ పడింది. నా ఉద్దేశ్యం అది కాదు, నన్ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని హర్టయ్యాడు. అప్పటినుంచి డౌన్ అవుతూ వచ్చాడు. నాగార్జున అన్నట్లుగానే ఇంట్లో వస్తువులకు, హరీశ్‌కు మధ్య పెద్ద తేడా లేనట్లుగానే కనిపించింది.

ఆ విషయంలో మెచ్చుకోవాల్సిందే!
తనకు ఆడాలని, హౌస్‌లో ఉండాలని కాస్తయినా ఆసక్తి లేకపోతే ప్రేక్షకులు మాత్రం ఏం చేస్తారు? అందుకే బయటకు పంపించేశారు. అయితే ఓ విషయంలో మాత్రం హరీశ్‌ను మెచ్చుకుని తీరాల్సిందే! ఓ గేమ్‌లో హరీశ్.. దివ్యను జాగ్రత్తగా పట్టుకున్నాడు. అయినా ఆమె చూసి పట్టుకోండి.. అంటూ అనవసర కామెంట్లు చేయడంతో అతడు ఆమె కాళ్లు మొక్కాడు. అక్కడ హరీశ్ అందరికీ నచ్చేశాడు. గుండెలో ఎంత బాధుంటే అలా చేస్తాడు! అని హరీశ్‌పై జాలిపడ్డారు.
రెమ్యునరేషన్
తను ఎలిమినేట్ అయినప్పుడు కూడా అతడి ముఖంలో ఎటువంటి ఎక్స్‌ప్రెషన్ లేదు. ఇంట్లో ఉండాలని లేదు, ఇలాంటి మనుషుల మధ్య ఉండలేను అని చాలాసార్లు అన్న హరీశ్.. ఎట్టకేలకు వారి మధ్య నుంచి బయటకు వచ్చేస్తున్నందుకు లోలోన సంతోషించాడేమో! ఇకపోతే హరీశ్ వారానికి రూ.60-70 వేల మేరకు పారితోషికం తీసుకున్నాడు. ఈ లెక్కన నాలుగు వారాలకు గానూ రూ.2.50 లక్షల పైచిలుకు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.