కష్టపడితే ఫలితం దానంతటదే వస్తుంటారు.. ఏదీ? రాదే? అందరికంటే ఎక్కువ కష్టపడిన ఇమ్మాన్యుయ్యేల్‌ను నాగార్జున సీజన్ అంతా ఆకాశానికెత్తారు. గోల్డెన్ స్టార్.. ప్రేక్షకుల సపోర్ట్ నీకే అంటూ మురిపించారు. గెలుపు గురించి ఢోకా లేదు, తడిగుడ్డ వేసుకుని పడుకో అన్నచందంగా బీబీ టీమ్ బిల్డప్ ఇచ్చింది. ట్రోఫీని ముద్దాడటమే ఆలస్యం అని గంపెడాశతో ఉన్న ఇమ్మాన్యుయేల్‌ను చివరకు నట్టేట ముంచారు.
తప్పెవరిది?
విన్నర్ కాదు కదా రన్నర్‌వి కూడా కాలేవంటూ నాలుగో స్థానంలో పడేశారు. అతడు పడ్డ కష్టానికి, వచ్చిన నాలుగో ర్యాంక్‌కు అసలు సంబంధమే లేదు. ఇక్కడ తప్పెవరిది? బిగ్‌బాస్ టీమ్‌దా? ప్రేక్షకులదా? పోనీ ఇమ్మూ కేవలం కామెడీ మాత్రమే పంచాడా? అంటే కానే కాదు. తనకున్న తెలివితేటలు అమోఘం. నాగార్జున ఏం అడుగుతాడు? ఈ వారం జరగనుంది? అని ముందే ఊహించేవాడు. అతడు లెక్క ఎప్పుడూ తప్పవలేదు. తను ఊహించిందే జరిగింది.
సంజనాను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి
సంజనా గుడ్డు దొంగతనం చేసినప్పుడు అందరూ కయ్యిమని అరుస్తూ ఆమెను నానామాటలు అంటుంటే ఇమ్మూ (Emmanuel) ఒక్కడే ఆమె గేమ్‌ప్లాన్ అర్థం చేసుకున్నాడు. తాను తిట్లుపడ్డా తప్పులేదు, కానీ ప్రేక్షకుల్ని ఎలాగైనా అలరించాలన్న ఆమె కసిని గమనించి ఫిదా అయ్యాడు. చంటిపాపను, కొడుకును వదిలేసి వచ్చిన ఆమెకు కొడుకయ్యాడు. ప్రేమను పంచాడు. ఆమె తప్పులు చేసినప్పుడు వారించాడు.

కెప్టెన్సీ త్యాగం
మాటలు తూలినప్పుడు హెచ్చరించాడు. నాగార్జున ముందు కూడా తప్పును తప్పే అని వాదించాడు. కానీ, తనను ఎలిమినేషన్ నుంచి కాపాడుకునే ఛాన్స్ వచ్చినప్పుడు క్షణం ఆలోచించకుండా కెప్టెన్సీని త్యాగం చేశాడు. కావాలంటే కెప్టెన్సీని మళ్లీ సంపాదిస్తానన్న ధైర్యం, అమ్మ కావాలన్న తపన.. రెండూ అతడిలో కనిపించాయి. ఎమోషనల్, తెలివితేటలు, మంచితనం, స్నేహబంధం వంటివెన్నో ఉన్నా అతడిలో కొన్ని మైనస్ కూడా ఉన్నాయి.
ఆటను చేజేతులా నాశనం చేసుకున్నాడా?
మొదట నామినేషన్ అంటే భయం. ఆ భయమే తన ఓటమికి పునాది వేసింది. సీజన్ మొత్తంలో అందరికంటే ఎక్కువ టాస్కులు గెలిచిన ఇమ్మూ.. తన సత్తా ఏంటో చూపించాడు. టాస్కుల మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న అతడు టికెట్ టు ఫినాలేలో మాత్రం కల్యాణ్‌తో చేతులు కలిపాడు. ఇది అతడికి మరో మైనస్‌గా మారింది. సింగిల్ సింహంలా ఎన్నో గేమ్స్ ఆడి గెలిచిన ఇమ్మూ చివరికొచ్చేసరికి ఇలా మరొకరితో జోడీ కట్టి పక్కవాళ్లను ఓడించాలని చూడటం చాలామందికి నచ్చలేదు.
మరోసారి రుజువైంది!
కానీ ఇంతమాత్రానికే అతడిని నాలుగో స్థానంలో పెట్టడం కరెక్ట్ కాదనే చెప్పాలి. ఏదేమైనా ఇక్కడ ఇమ్మాన్యుయేల్ ఓడిపోలేదు.. అందరూ కలిసి అతడిని ఓడించారు. కమెడియన్లు ప్రాణం పెట్టి ఆడినా, కట్టే కాలేవరకు నవ్విస్తామన్నా వాళ్లను కేవలం జోకర్స్‌లాగే చూశారు. ఇప్పుడు అందరిలో జోకర్‌గానే నిలబెట్టారు. కమెడియన్స్ కప్పు గెలవలేరని మరోసారి రుజువు చేశారు!


