బిగ్‌బాస్ 9 నుంచి డీమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు, కాదు తనంతట తానే తలెత్తుకుని బయటకు వచ్చాడు. అగ్నిపరీక్ష పోటీలో గెలిచి షోలో అడుగుపెట్టినప్పుడు అసలు ఇతడికి ఎలా అవకాశమిచ్చారని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ తన ఎంపిక ఏదో అల్లాటప్పా కాదని పవన్ నిరూపించాడు. రీతూతో బంధంపై విమర్శలు వచ్చినప్పటికీ టాస్కుల పరంగా తన బెస్ట్ ఇచ్చాడు.
సూట్‌కేస్‌తో బయటకు
రెండుసార్లు కెప్టెన్ కూడా అయ్యాడు. ఏకంగా టాప్-3లో చోటు దక్కించుకున్నాడు. తెలివిగా మాస్ మహారాజ రవితేజ ఆఫర్ చేసిన రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని బయటకు వచ్చేశాడు. సీజన్ అంతా పవన్‌ను తొక్కేసిన బిగ్‌బాస్.. జర్నీ వీడియోలో మాత్రం వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. మీ విల్ పవర్, ఫిట్‌నెస్ మాత్రమే కాదు, గెలుపు కోసం చివరివరకూ పోరాడే తత్వం మిమ్మల్ని నిజమైన యోధుడిగా మార్చేశాయి.
ముందు తొక్కేసి తర్వాత పొగడ్తలు
కామనర్‌గా అడుగుపెట్టిన పవన్ యోధుడిగా మారారు. అమాయకమైన చిరునవ్వు వెనకున్న డీమాన్ ఏంటో అందరికీ చూపించారు. నామినేషన్లలో ఎంతమంది మాటలతో దాడి చేసినా, మీరు మౌనంగా నిలబడ్డారు. అవసరమైనప్పుడు మాత్రమే ధీటుగా బదులిచ్చారు' అని చెప్పుకొచ్చాడు. ఓ దశలో రీతూతో బంధం కారణంగా డీమాన్ ఆటతీరుపై చాలానే విమర్శలు వచ్చాయి.
టాస్కుల బాహుబలి
కానీ వాటిని తట్టుకుని నిలబడ్డాడు. రీతూ ఎలిమినేట్ అయి బయటకెళ్లిపోయిన తర్వాత డీమాన్ అసలు గేమ్ బయటపడింది. పంచ్‌లేస్తూ కామెడీ చేయడం, టాస్కుల్లో బాహుబలిలా ఆడటం, గేమ్‌పై ఫుల్ ఫోకస్ లాంటి అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ స్పీడ్ ముందు నుంచి ఉండుంటే కచ్చితంగా విన్నర్ అయ్యేవాడే అని కూడా మాట్లాడుకున్నారు. ఏదేమైనా సెకండ్ రన్నరప్‌గా బయటకు వచ్చాడు.
సంపాదన ఎంతంటే?
ఇతడి రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. కామనర్స్ అందరికీ ఒకే పారితోషికం ఇచ్చారు. అలా డీమాన్‌కి కూడా వారానికి రూ.70 వేల పారితోషికం ఇచ్చేలా డీల్ కుదిరింది. ఓవరాల్‌గా 15 వారాలకుగానూ రూ.10.50 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. దీనికి రూ.15 లక్షలు తోడవడంతో మొత్తం రూ.25 లక్షలకు పైగా సంపాదించాడు. మొత్తానికి పవన్‌కు ఈ షోతో డబ్బుకు డబ్బు, పేరుకు తగ్గ గుర్తింపు వచ్చింది.


