
బిగ్‌బాస్ 9వ సీజన్ (Bigg Boss Telugu 9)లో ప్రస్తుతం పదమూడు మంది కంటెస్టెంట్లున్నారు. విన్నింగ్ మెటీరియల్ అనిపించేలా ఏ ఒక్కరూ లేరు. అంతో ఇంతో ఇమ్మాన్యుయేల్ పర్వాలేదనిపిస్తున్నాడు. ఆటకు ఆట.. వినోదానికి వినోదం, ఎమోషన్స్‌కు ఎమోషన్.. అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. కానీ కొన్నిసార్లు అతి మంచితనం చూపిస్తున్నాడు.
అగ్నిపరీక్ష నుంచి మరొకరు
ఇకపోతే అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామనర్స్ ప్రేక్షకులకు విపరీతంగా విసుగు తెప్పిస్తున్న సంగతి తెలిసిందే కదా! అయితే అదే అగ్నిపరీక్ష నుంచి మరో ఇద్దర్ని హౌస్‌కు పంపించనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో షాకిబ్, దివ్య నిఖిత, నాగ ప్రశాంత్, అనూష రత్నం ఉన్నారు. వీరిలో ఒకర్ని మీరే ఎంపిక చేయాలని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు బాధ్యత అప్పగించాడు.

ఉన్నదున్నట్లు మాట్లాడిన అనూష
దానికంటే ముందు అనూష.. శ్రీజ (Dammu Srija)కు వరుస కౌంటర్లిచ్చింది. నీ ఇగో సంతృప్తి చెందకపోతే పుండుపై పిన్నుతో గుచ్చినట్లు పొడుస్తూనే ఉంటావ్. 24 గంటలు నెగెటివ్ ఎనర్జీతో ఉండే నీతోనే స్వాప్ చేసుకోవాలనుకుంటున్నా అంది. ఆ మాటకు శ్రీజ షాకై అలా చూస్తూ కూర్చుండిపోయింది. షాకీబ్.. పవన్ కల్యాణ్ స్థానాన్ని తీసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.
టైంపాస్ చేయడానికా?
అక్కడితో ఆగలేదు. పవన్ చేస్తున్న పనుల్ని ఎండగట్టాడు. షోకి ఎందుకొచ్చినం బ్రో? టైంపాస్ చేయడానికి కాదు కదా.. బయటకు వెళ్లగొడితే ఎట్లుంటదనేది నేను ఆల్‌రెడీ చూసేశిన. ఆ ఫీలింగ్ మీకు తెలియదు అన్నాడు. మొత్తానికి వచ్చీరావడంతోనే శ్రీజ, పవన్ కల్యాణ్‌కు ఆడియన్స్ ఎలా ఫీలవుతున్నారనేది చెప్పి వారికి హింట్లు ఇచ్చేశారు. ఇక హౌస్‌మేట్స్ అందరూ దివ్య నిఖితను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.