‘‘తెలుగులో నేను విన్న తొలి స్క్రిప్ట్, ఒప్పుకున్న సినిమా ‘కాంత’. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ కాస్త ఆలస్యంగా మొదలైంది. ఆ గ్యాప్‌లో ‘మిస్టర్ బచ్చన్, కింగ్‌డమ్’ సినిమాలు చేశాను. ‘కాంత’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. పూర్తి స్థాయిలో నటనకి అవకాశం ఉన్న కుమారి పాత్రను ఈ చిత్రంలో చేశాను’’ అని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చెప్పారు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జోడీగా నటించిన చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా, సముద్ర ఖని కీలక పాత్రలు చేశారు.
రానా, దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ– ‘‘నాలాంటి కొత్త అమ్మాయికి ‘కాంత’లో కుమారిలాంటి పాత్ర దొరకడం అదృష్టం. సవాల్‌గా తీసుకుని ఈ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం శ్రీదేవి, సావిత్రిగార్ల నటనని స్ఫూర్తిగా తీసుకున్నాను. ఇప్పటివరకు నన్ను కమర్షియల్ నటి అన్నారు. ‘కాంత’ తర్వాత గొప్ప నటి అంటారని ఆశిస్తున్నా.
కుమారి పాత్రని సెల్వరాజ్‌గారు రాసుకున్న విధానం ఆశ్చర్యపరిచింది. నేను నటించిన ‘కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలు ఒకే నెలలో విడుదలవుతుండటం ఎగ్జయిటింగ్‌గా ఉంది. నా వరకు 100 శాతం కష్టపడ్డాను. మంచి ఫలితం దక్కుతుందనే నమక్మకం ఉంది. మంచి కథ కుదిరితే తమిళ్‌లోనూ సినిమా చేస్తాను. అయితే నా తొలిప్రాధాన్యం తెలుగు సినిమాకే. ప్రస్తుతం కొన్ని తెలుగు, హిందీ సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు.


