
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌లో పాల్గొన్న రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మిలకు నోటీసులు
అందరికీ సమన్లు జారీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రెటీలను విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తేదీల వారీగా సినీతారలకు విచారణకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మిలకు వేర్వేరుగా సోమవారం సమన్లు జారీ చేసింది. బుధవారం రానా దగ్గుబాటి, ఈ నెల 30న ప్రకాశ్‌రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మిలను విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది.
బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేయడంలో వారి పాత్ర..ఇందుకు సంబంధించి ఆయా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు..తీసుకున్న పారితోషకాల వివరాలు, అందుకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు, ఇతర డాక్యుమెంట్లను తీసుకుని హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ ఆఫీసులో హాజరుకావాలని సూచించారు. సైబరాబాద్, సూర్యాపేట, పంజగుట్ట, మియాపూర్, విశాఖపట్నంలో లోన్ యాప్‌లపై నమోదైన వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) రిజిస్టర్ చేసిన విషయం తెలిసిందే. లోన్ యాప్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్‌లో చేర్చింది.