
‘‘కిష్కింధపురి’ని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. గురువారం మూడు ప్రీమియర్ షోలు వేద్దామనుకుని, మొదలైన మా సినిమాకు 66 షోలు పడ్డాయి. ఆర్గానిక్‌గా మా సినిమా ఆడియన్స్‌కు చేరువైంది. మా ‘కిష్కింధపురి’కి వారి ప్రేమ దక్కింది. ఈ ప్రేమ కొనసాగుతుంది. తెలుగు ప్రేక్షకులు గొప్పోళ్ళు. గొప్ప చిత్రాన్ని కాపాడతారు’’ అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదలైంది.
శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే కృషితో చేసిన సినిమా ‘కిష్కింధపురి’. సాహుగారు ఎంతగానో సపోర్ట్ చేసి, ఈ సినిమాను నిర్మించారు. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు.
‘‘మేము అనుకున్నదానికంటే డబుల్ ఇంపాక్ట్ రెస్పాన్స్ వస్తోంది. మా బ్యానర్‌లో మంచి సినిమా పడింది’’ అని తెలిపారు సాహు. ‘‘ఫస్ట్ టైమ్ హిట్ కొట్టినప్పుడు ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ మూమెంట్స్‌ని నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను’’ అని పేర్కొన్నారు కౌశిక్. ‘‘ప్రేక్షకుల స్పందన మా సినిమాకు గొప్ప బలాన్నిచ్చింది’’ అని చెప్పారు చేతన్ భరద్వాజ్.