
కోట శ్రీనివాసరావు, బాబుమోహన్..తెలుగు తెరపై వీరిద్దరు చేసిన కామెడీ ఎప్పటికీ మరచిపోలేనిది. ఈ ఇద్దరు దిగ్గజ నటులు వెండితెరపై కనిపిస్తే చాలు.. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేవారు. బయట కూడా వీరిద్దరు చాలా అనోన్యంగా ఉండేవాళ్లు. కోట తనకు అన్నలాంటి వాడని బాబు మోహన్, బాబు మోహన్ నాకు తమ్ముడి కంటే ఎక్కువ అని కోట.. ప్రతిసారి చెప్పేవారు. ఆదివారం తెల్లవారుజామున కోట శ్రీనివాసరావు మరణించారనే వార్త తెలియగానే బాబు మోహన్ బోరున విలపించారు. తనకు అన్నం తినిపించే అన్న ఇక లేడంటూ ఎమోషనల్ అయ్యాడు.
(చదవండి: అందరి గుండెల్లో 'కోట'.. తనదీ చార్మినార్‌కున్నంత హిస్టరీ 'తమ్మీ')
తాజాగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కోటన్న మరణం తనకు తీరని లోటు అన్నారు. ‘మొన్ననే ఆయనకు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడాను. ఓ సినిమా షూటింగ్ గురించి ఆయనతో చెప్పాను. నిన్ననే ఆయనను కలవానుకున్నాను కానీ కుదరలేదు. ఈ రోజు ఆయన ఇంటికి వస్తానని చెప్పా. ఉదయం 10 గంటలకు వెళ్లాల్సి ఉండే. కానీ ఈలోపే ఆయన మరణించారనే వార్త తెలిసింది.
(చదవండి : ఒక గొప్ప నటుడిని కోల్పోయాం.. కోట శ్రీనివాసరావు మృతిపై ప్రముఖుల సంతాపం)
సినిమాలో కనిపించినట్లుగానే బయట కూడా చాలా సరదగా ఉండేవాళ్లం. నన్ను సొంత తమ్ముడిలా చూసుకునేవాడు. ఒకే ప్లేటులో కలిసి తిన్నాం. నాకు అన్నం ముద్దలు తినిపించిన అన్న ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను’ అంటూ బాబు మోహన్ బోరున విలపించాడు.
